Begin typing your search above and press return to search.

ఫ్లైట్ లోనూ గవర్నర్ ను వదలని మీడియా

By:  Tupaki Desk   |   9 Feb 2017 1:42 PM GMT
ఫ్లైట్ లోనూ గవర్నర్ ను వదలని మీడియా
X
మీడియాలో పోటీ అనండి. అందరికంటే భిన్నమైన సమాచారం ఇవ్వాలన్న అతృత కావొచ్చు. మరింకేదైనా కావొచ్చు. తాజాగా మీడియా ప్రతినిధులు ప్రదర్శించిన అత్యుత్సాహం అందరూ వేలెత్తి చూపటమే కాదు.. మరీ.. ఇలా కూడానా? అన్న ప్రశ్నలు వేసేలా ఉండటం గమనార్హం. దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న తమిళనాడు రాజకీయ సంక్షోభానికి సంబంధించి.. గవర్నర్ నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది.

మహారాష్ట్రకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న విద్యాసాగర్ రావు.. తమిళనాడుకు ఇన్ చార్జ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చేందుకు ముంబయి నుంచి చెన్నైకి బయలుదేరారు. అనూహ్యంగా విమానంలో ఆయన్ను కొందరు మీడియా ప్రతినిధులు మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకూ బస్సుల్లోనూ.. రోడ్లలోనూ.. మరింకే ప్లేస్లులోనూ తమతో మాట్లాడాలని కోరటం కనిపిస్తుంది. తాజాగా విమానంలోనూ అదే తీరును కంటిన్యూ చేయటమే కాదు.. మాట్లాడాలంటూ ముఖం మీద మైకులు పెట్టటం గమనార్హం.

ఒక రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరించే వ్యక్తి తన ప్రయాణంలో ఉన్నప్పుడు ఆయన వద్దకు వెళ్లేసి.. కెమేరా పెట్టేసి తమిళనాడు ఇష్యూ మీద స్పందించాలని కోరిన తీరు చూస్తే.. మీడియాకు మరీ ఇంత అత్యుత్సాహం అవసరమా? అన్న భావన కలగటం ఖాయం. తనను రియాక్ట్ అవ్వాలని కోరిన మీడియాను సున్నితంగా తిరస్కరించి.. మౌనంగా ముఖం తిప్పేసి ఉండిపోయారు గవర్నర్ విద్యాసాగర్ రావు. ప్రముఖుల విషయంలో మీడియా సంస్థలు.. ప్రతినిధులు కాస్తంత హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెమేరాలు పెట్టేసే కన్నా.. మర్యాదగా అనుమతి అడిగితే బాగుండేదేమో?