Begin typing your search above and press return to search.

చెన్నై పొలిటికల్ తుఫాన్ ఏ తీరం చేరేనో..?

By:  Tupaki Desk   |   9 Feb 2017 7:05 AM GMT
చెన్నై పొలిటికల్ తుఫాన్ ఏ తీరం చేరేనో..?
X
తమిళనాడులో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు ఎన్నుకున్న నేత అయిన శశికళతో గవర్నరు విద్యాసాగరరావు ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయించలేదు. దీంతో తమిళనాట ప్రజాస్వామ్య విలువలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాత రేస్తోందన్న విమర్శలొస్తున్నాయి. అన్నా డీఎంకే లెజిస్లేచర్‌ సభ్యులు చేసిన ఏకగ్రీవతీర్మానం ఆధారంగా ముఖ్యమంత్రి పీఠం చేపట్టమంటూ ఆమెను ఆహ్వానించవచ్చు.. కానీ, బీజేపీ మాత్రం ఆ పని చేయడం లేదు. అంతేకాదు.. ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం రాజీనామా చేశారు. దీన్ని హుటాహుటిన ఆమోదించిన గవర్నర్‌ తదనంతర పరిణామాలకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా చెన్నై వీడి వెళ్ళిపోయారు. ఈ రోజు గవర్నరు చెన్నై వస్తుండడం... శశికళకు అపాయింటుమెంటు ఇవ్వడంతో ఏం జరగనుందా అన్న టెన్షన్ అన్నా డీఎంకే వర్గాల్లో కనిపిస్తోంది.

గవర్నర్‌ చర్య ప్రజాస్వామ్యవాదుల విమర్శలకు గురౌతోంది. ఇది ఖచ్చితంగా నిబంధనల్ని అతిక్రమించడమేనన్న వాదన వినిపిస్తోంది. లెజి స్లేచర్‌ పార్టీ నాయకురాలికి ముఖ్యమంత్రి బాధ్యత లప్పగించడం గవర్నర్‌ విధుల్లో ఒకటి. ఇందులో సొంత పెత్తనానికి ఆస్కారం లేదు. ఇలా నాయకురాలిగా ఎన్నికైన వ్యక్తి భారత రాజ్యాంగం నిర్దేశించిన నియమనిబంధనలకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించడం వరకే గవర్నర్‌ బాధ్యత. లేనిపక్షంలో అదే విషయాన్ని తెలియజేసి బాధ్యతల స్వీకరణ నిమిత్తం ఆహ్వానించేందుకు తన అసక్తత తెలపొచ్చు. అంతేతప్ప ఎలాంటి సహేతుక కారణం చూపకుండా ఇలా గైర్హాజరుకావడం రాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనన్న విమర్శలకు ఆయన గురౌతున్నారు.

సమాఖ్య వ్యవస్థలో కేంద్రానికి కొన్ని నిర్దిష్ట హక్కులు, బాధ్యతలున్నాయి. అలాగే వాటికి కొన్ని పరిధులు కూడా ఉన్నాయి. రాష్ట్రాలకు కొన్ని హక్కు లు, బాధ్యతలుంటాయి. రెండింటిని సమన్వయం చేయాల్సిన గవర్నర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తే కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై ప్రభావం చూపి స్తుంది. శశికళకు అర్హతల్లేవంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఆమె ఎమ్మెల్యే కాదని మరికొందరు పేర్కొంటున్నారు. అసలామె ఏ విధంగా ముఖ్య మంత్రి అవుతారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. జయను చూసి ఓట్లేశారు.. శశికోసం కాదంటూ కొందరు అంటున్నారు. అయితే భారత రాజ్యాంగంలో ఇలాంటి ప్రస్తావన ఎక్కడా లేదు.

అసలు ముఖ్యమంత్రి కావాలంటే అర్హతలేమిటి..?

* ముఖ్య మంత్రికి అవసరమైన అర్హతలు, ఆ పదవి చేపట్టేం దుకు నియమ నిబంధనలను రాజ్యాంగంలో క్లియర్ గా చెప్పారు. రాజ్యాంగంలోని 164వ అధికరణం ప్రకారం ప్రజలచేత అసెంబ్లికి ఎన్నుకోబడ్డ సభ్యులకు చెందిన ఒక పార్టీ లేదా కొన్ని పార్టీల సమూహం సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకోవాలి. ఇదే విషయాన్ని రాతపూర్వకంగా గవర్నర్‌ కు తెలియ జేయాలి. అలా ఎన్నికైన వ్యక్తిని గవర్నర్‌ విధిగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. ఆ వ్యక్తి సూచనల మేరకు మంత్రివర్గ ప్రమాణస్వీకారాన్ని చేపట్టాలి.

* అయితే.. ఇదే అధికరణంలోని ఐదవ నిబంధన మేరకు ఎన్నికైన నేతకు అసెంబ్లిలో నిర్ధిష్ట ఆధిక్యత లేదని గవర్నర్‌ భావించిన పక్షంలో ఈ ప్రతిపాదనను పెండింగ్‌ లో పెట్టొచ్చు. లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసి 30రోజుల్లోగా అసెంబ్లిలోనే బలాన్ని నిరూపించుకోమని ఆదేశించొచ్చు.

* సీఎంగా ఎన్నికయ్యే వ్యక్తి భారత పౌరసత్వం కలిగుండాలి. 25ఏళ్ళపైబడి వయ స్సుండాలి. అదే మండలి నుంచి ఎన్నికైతే 30ఏళ్ళ వయసుపైబడాలి. గతంలో ఎప్పుడూ కోర్టులచేత శిక్షింపబడుండకూడదు. మానసిక వైకల్యం లేనివారై ఉండాలి.

.... ఈ నిబంధనలన్నీ శశికళ విషయంలో అనుకూలంగానే ఉన్నాయి. కోర్టుల నుంచి శిక్షించబడకూడదన్న నిబంధన వద్దే కొంత ఇబ్బంది ఉంది. అక్రమాస్తుల కేసులో కొద్దిరోజుల్లో తీర్పు రానుంది. శిక్ష పడినా పడొచ్చు. కానీ.. ప్రస్తుతం అది విషయం కాదు కాబట్టి తీర్పు వచ్చేవరకు ఆగడమన్నది గవర్నరుకు సరికాదన్న వాదన ఉంది. అన్నీ అనుకూలంగానే ఉన్నా గవర్నర్‌ ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ తన రాజకీయమంతా చూపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/