Begin typing your search above and press return to search.
తమిళ పాలిటిక్స్ యూటర్న్!..ఎడప్పాడి సేఫ్!
By: Tupaki Desk | 30 Aug 2017 8:36 AM GMTతమిళనాడు రాజకీయాలు గవర్నర్ విద్యాసాగర్ రావు సాక్షిగా యూటర్న్ తీసుకున్నాయి! ఇప్పటి వరకు రాజకీయంగా అనేక మలుపులు తిరిగిన తమిళనాడు వ్యవహారం.. చివరకు గవర్నర్ షాక్‌తో ఇప్పుడు మరో కొత్త అధ్యయనానికి తెరదీసింది. ఇక, ఈ వివాదాలతో తలబొప్పికట్టి.. సీఎం సీటు ఉంటుందో ఊడుతుందో అని తీవ్రంగా మథన పడిపోయిన ఎడప్పాడి పళనిస్వామి వర్గాన్ని సేఫ్ జోన్ లోకి మార్చారు గవర్నర్. వడివడిగా మారిన తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు గవర్నర్ కేంద్రంగా మరింత రంగుతేలడం విశేషం.
నిజానికి తమిళనాడు రాజకీయాలు అమ్మ మరణం నుంచి సక్రమంగా లేవనేది అందరికీ తెలిసిందే. పార్టీ పదవుల కోసం , సీఎం సీటుకోసం ఇలా ఎవరికివాళ్లే.. రోడ్డున పడ్డారు. అమ్మ పేరుతో కన్నీరు పెట్టుకున్నారు. ఇక, శశికల జైలుకు వెళ్లడం, ఆమె అనుంగు అనుచరుడు దినకరన్ ఈసీ కేసులో పట్టుబడడంతో రాష్ట్రంలో సీఎం పళనిస్వామి, మాజీ సీఎం ఓపీఎస్ వర్గాలు ఇటీవల చేతులు కలిపి.. కొత్తపొద్దుకు తెరలెత్తాయి. దీంతో రాష్ట్రంలో సంక్షోభం సమసిపోతుందని అందరూ అనుకున్నారు.
కానీ, ఇంతలో దినకరన్ జైలు నుంచి రావడం.. ఎడప్పాడికి మద్దతిస్తున్న కొందరు ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడం జరిగిపోయింది. దీంతో దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు 20 మంది ఎడప్పాడి ప్రభుత్వంపై విశ్వాసం లేదంటూ.. గవర్నర్‌కు నివేదిక సహా లేఖలు అందించారు. దీంతో రాజకీయంగా రాష్ట్రం ఒక్కసారిగా నివ్వెర పోయింది. ఇక, వీరిని కాపాడుకునేందుకు, మరింత మందిని పార్టీలోకి ఆహ్వానించేందుకు శశికళ వర్గం నేత దినకరన్ వీరితో క్యాంపు రాజకీయాలకు తెరదీశారు.
ఇక, ఈ విషయంలో కొంత సీరియస్ గా ఉన్న విపక్షాలు ఎడప్పాడి ప్రభుత్వానికి మద్దతు లేదని సొంత పార్టీ ఎమ్మెల్యేలు దినకరన్ గూటికి చేరారని, కాబట్టి ఆయనతో విశ్వాస పరీక్ష చేయిస్తే.. విషయం తెలిసిపోతుందని గవర్నర్ ను కలిశారు. వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి.. సీఎం పళనిస్వామిపై విశ్వాసపరీక్ష పెట్టాలని, అందులో ఆయన ఎలాగూ ఓడిపోతాడు కాబట్టి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని వీరు అభ్యర్థించారు. వీరి నెనుక స్టాలిన్ సహా విపక్షాలు కూడా ఉండడం గమనార్హం. అయితే, వీరి విజ్ఞప్తిని గవర్నర్ తోసిపుచ్చారు.
సీఎం పళనిస్వామిపై ఎదురుతిరిగిన దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఇంకా అన్నాడీఎంకేలోనే కొనసాగుతున్నారని చెప్పారు. కాబట్టి రెబల్స్ డిమాండ్ మేరకు తాను నడుచుకోలేనని ఆయన షాక్ ఇచ్చారు. పళనిస్వామిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ను గవర్నర్ సున్నితంగా తిరస్కరించారని ప్రతిపక్ష వీసీకే పార్టీ నేత తిరుమవలవాన్ తెలిపారు. అయితే, తాము ఇదే విషయంపై రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉందన్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి. ఇప్పటికైతే పళనిస్వామి ప్రభుత్వానికి నష్టంలేదు.