Begin typing your search above and press return to search.

అరాచకంగా సాధించుకున్నారు

By:  Tupaki Desk   |   22 Feb 2016 6:45 AM GMT
అరాచకంగా సాధించుకున్నారు
X
హద్దుల్లేని ఆవేశంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. విధ్వంసమే లక్ష్యంగా.. తమ హక్కుల సాధన కోసం దేనికైనా రెఢీ అన్నచందంగా వ్యవహరిస్తూ జాట్లు చేపట్టిన ఆందోళనకు హర్యానా సర్కారు తలొగ్గింది. జాట్ల సామాజిక వర్గానికి బీసీ హోదా ఇచ్చేందుకు ఓకే చెప్పేసింది. ఎనిమిది రోజులుగా సాగుతున్న ఆందోళనకు.. మూడు రోజుల్లో హింసాత్మకం కావడంతో హడలిపోయిన హర్యానా సర్కారు.. జాట్లను శాంతింప చేసేందుకు నడుం బిగించింది.

ఈ ఇష్యూ మీద కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగి.. హర్యానా పరిస్థితుల్ని చక్కదిద్దే ప్రయత్నం షురూ చేశారు. జాట్లను బీసీలుగా గుర్తించేందుకు వీలుగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి నేతృత్వంలో కమిటీని వేసేందుకు సిద్ధమైంది.

హర్యానా.. ఉత్తరప్రదేశ్.. ఢిల్లీ రాష్ట్రాల్లోని జాట్ నాయకులతో పాటు.. కేంద్రమంత్రులు.. పలువురు ఉన్నతాధికారులతో రాజ్ నాథ్ తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జాట్ల రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలకు పరిష్కారాన్ని సూచిస్తూ.. సమగ్ర నివేదికను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాలతో జాట్లు శాంతించారు.

ఆందోళన విరమించిన అనంతరం రహదారుల్ని దిగ్బంధించిన ఆందోళకారులు వేసిన అడ్డును వారే తొలగిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న రెండు మూడురోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.
ఏదిఏమైనా.. మెరుపు ఆందోళనలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించి.. విధ్వంసమే లక్ష్యంగా చేపట్టిన నిరసనలకు ప్రభుత్వం తలొగ్గడం ఆందోళన కలిగించే అంశం. ఇదే రీతిలో ఎవరికి వారు.. తమ డిమాండ్ల సాధనకు హింసను అయుధంగా చేసుకుంటే..? పరిస్థితి ఏంటి?