Begin typing your search above and press return to search.

రామోజీకి 295 ఎక‌రాలు ఇచ్చేందుకు రెఢీ

By:  Tupaki Desk   |   4 April 2017 4:37 AM GMT
రామోజీకి 295 ఎక‌రాలు ఇచ్చేందుకు రెఢీ
X
మీడియో మొఘ‌ల్.. ఈనాడుసంస్థ‌ల అధినేత చెరుకూరు రామోజీరావు కోరుకున్న‌ట్లే 295 ఎక‌రాల భూమిని కేటాయించేందుకు కేసీఆర్ స‌ర్కారు ఓకే చెప్పేసింది. రామోజీ ఫిలింసిటీ అభివృద్ధి కోసం భారీ ఎత్తున భూమిని కోరిన రామోజీ ప్ర‌తిపాద‌న‌కు త‌గ్గ‌ట్లే.. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు ఓకే చెప్పేసింది. అయితే.. రామోజీ కోరుకున్న భూముల‌న్నీ అసైన్డ్ భూములు కావ‌టం గ‌మ‌నార్హం. తాము కోరుకున్న భూమిని త‌మ‌కు కేటాయించిన ప‌క్షంలో.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌రకు చెల్లించి సొంతం చేసుకుంటామ‌ని రామోజీ ప్ర‌భుత్వాన్ని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన తెలంగాణ స‌ర్కారు.. వారు కోరుకున్న భూమిని సేక‌రించి.. ప‌ర్యాట‌క శాఖ ద్వారా ఆయ‌న‌కు అప్ప‌గించాల‌ని డిసైడ్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక‌.. ప్ర‌భుత్వం చెప్పే ధ‌ర‌ను చెల్లించ‌టానికి రామోజీ ఓకే చెప్పేశారు.

రామోజీ ఫిలింసిటీకి అనుబంధంగా ఓంసిటీని ఏర్పాటు చేయాల‌న్న‌ది రామోజీరావు క‌ల అన్న విష‌యం తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా ఉన్న 108 ప్ర‌ముఖ దేవాల‌యాల్ని ఒకే చోట ఏర్పాటు చేసి.. ఆయా దేవాల‌యాల్లో జ‌రిగే క్ర‌తువుల్ని య‌థావిధిగా జ‌రిపించే భారీ ప్రాజెక్టుపై ఆయ‌న కొన్నేళ్లుగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇందుకు అవ‌స‌ర‌మైన భూమిని త‌మ‌కు కేటాయించాల‌ని కోరుతూ.. గ‌తంలోనే తెలంగాణ స‌ర్కారుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. దాదాపు ర‌.10వేల కోట్ల‌కు పైనే పెట్టుబ‌డులు పెట్ట‌టంతోపాటు.. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఒక‌ద‌శ‌లో రోజుకు లక్ష మంది వ‌ర‌కూ యాత్రికులు ఓంసిటీని చూసేందుకు వ‌స్తార‌న్న అంచ‌నా ఉంది.

ఇదిలా ఉంటే.. రామోజీ కోరుకున్న‌ట్లే.. ఆయ‌న‌కు భూమిని కేటాయించేందుకుప్ర‌భుత్వం రంగం సిద్ధం చేసింది. రామోజీ కోరిన భూములు అసైన్డ్ భూములుఅయిన‌ప్ప‌టికీ.. వాటి ల‌బ్ధిదారుల నుంచి సేక‌రించి.. వాటిని ఆయ‌న‌కు అప్ప‌గించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇబ్ర‌హీం ప‌ట్నం మండ‌లం నాగ‌న్ ప‌ల్లిలో 250.13 ఎక‌రాలు.. అబ్దుల్లాపూర్ మెట్ మండ‌లంలోని 125.24 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానికి ఉంది. ఇందులో 295 ఎక‌రాల్ని ఫిలింసిటీ విస్త‌ర‌ణ‌కుకావాల‌నిరామోజీ గ్రూప్ కోరింది. అయితే.. ఈ భూమి మొత్తం.. కొండలు.. గుట్ట‌ల‌తో నిండి ఉండ‌టంతో.. వీటిని విభ‌జించ‌టం సాధ్యం కాని నేప‌థ్యంలో మొత్తం 376 ఎక‌రాల్ని కొనుగోలు చేయాల‌ని రామోజీ గ్రూప్‌కు కేసీఆర్ స‌ర్కారు కోరింది. ఇందుకోసం రూ.37.65 కోట్ల‌ను ప్ర‌భుత్వానికి డిపాజిట్ చేయాల‌ని రెవెన్యూ శాఖ వెల్ల‌డించింది. ఇక‌.. రామోజీకి ఇవ్వాల‌నుకుంటున్న 376 ఎక‌రాలూ.. అసైన్డ్ ల్యాండ్ కావ‌టం.. వీటిని ల‌బ్థిదారులు వాడుకోని నేప‌థ్యంలో.. వారి నుంచి భూమిని సేక‌రించి రామోజీకి ఇవ్వాల‌ని తెలంగాణ స‌ర్కారు భావిస్తోంది.

ఈ భూముల్ని వైఎస్ హ‌యాంలో ల‌బ్థిదారుల‌కు అంద‌జేశారు. నాడు ప‌ట్టాలు తీసుకున్న వారు ఎవ‌రూ భూముల్లో సాగు చేయ‌టం కానీ.. ఇళ్ల నిర్మాణాన్ని చేప‌ట్ట‌ని నేప‌థ్యంలో.. వీటిని రామోజీకి ఇచ్చేందుకు కేసీఆర్ స‌ర్కారుసిద్ధ‌మైంది. 2013 భూసేక‌ర చ‌ట్టం ప్ర‌కారం ఈ భూముల్ని ప్ర‌భుత్వం సేక‌రించి.. రామోజీఫిలింసిటీకి అంద‌చేస్తార‌ని చెబుతున్నారు. రామోజీ గ్రూపు అడిగిన 295 ఎక‌రాల‌కు మ‌రో 81.18 ఎక‌రాల్ని కూడా తీసుకోవాల‌ని కోర‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. నాగ‌న్ ప‌ల్లిలో భూముల బేసిక్ విలువ‌ను ఎక‌రా రూ.4ల‌క్ష‌లుగా నిర్ణ‌యించ‌గా.. రెవెన్యూ అధికారులు మార్కెట్ విలువ‌ను రూ.18ల‌క్ష‌లుగా అంచ‌నా వేశారు. అదే స‌మ‌యంలో అబ్దుల్లాపూర్ మెట్ లోని భూముల బేసిక్ విలువ రూ.9ల‌క్ష‌లుగా డిసైడ్ చేయ‌గా.. మార్కెట్ విలువ రూ.20ల‌క్ష‌లుగా అంచ‌నా వేస్తున్నారు. అసైన్‌దారుల‌కు ఎక‌రా రూ.10ల‌క్ష‌ల చొప్పున 376.32 ఎక‌రాల‌కు రూ.37.63కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని.. ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాల‌ని కోరారు. ప్ర‌భుత్వం ఓకే చెప్పిన త‌ర్వాత‌.. రామోజీ ఆగుతారా? ఈ ఆదేశాల కోస‌మే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న‌ట్లుగా రామోజీ అంత‌రంగికులు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/