Begin typing your search above and press return to search.

ప్రతి కంప్యూటర్ పై నిఘా.. కేంద్రం సంచలనం

By:  Tupaki Desk   |   22 Dec 2018 4:33 AM GMT
ప్రతి కంప్యూటర్ పై నిఘా.. కేంద్రం సంచలనం
X
ఎన్నికలకు ఇంకా 5 నెలల సమయం మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయం ఉన్నా బీజేపీ అసంబద్ధ నిర్ణయాలతో తన పుట్టి తాను ముంచుకుంటోంది. ఇప్పటికే కేబుల్ ప్రసారాల చానెల్ రుసుములను సగటును రూ.200 నుంచి 800 వరకు పెంచడం సామాన్య మధ్యతరగతి జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రజల వ్యక్తిగత కంప్యూటర్ లపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టేలా కేంద్రం ఆదేశాలు జారీ చేయడం దుమారం రేపుతోంది.

నిజానికి అభివృద్ధి చెందిన.. అత్యంత పటిష్ట భద్రత ఉండే అమెరికా - బ్రిటన్ - చైనా దేశాల్లోనూ ఇలా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా వాళ్ల కంప్యూటర్ లపై నిఘా సంస్థలకు అధికారం కట్టబెట్టలేదు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో కంప్యూటర్లపై నిఘాకు కేంద్ర నిఘా సంస్థలకు తాజాగా ఆదేశాలను జారీ చేసిన సంచలనం రేపుతోంది. దీని ప్రకారం కంప్యూటర్ ఏదైనా.. ఎక్కడున్నా.. ఎవరిదైనా సరే దాన్ని డీకోడ్ చేసేందుకు 10 నిఘా సంస్థలకు కేంద్ర హోంశాఖ పూర్తి అధికారాలను కట్టబెట్టింది. సైబర్ క్రైమ్ ను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర దర్యాప్తు సంస్థలకు కేంద్రం ఈ అధికారులిచ్చింది. కంప్యూటర్ ను వినియోగించే వ్యక్తి కానీ.. దానికి సర్వీస్ ప్రొవైడ్ చేసే వారు కూడా దర్యాప్తు సంస్థలకు సహకరించాల్సిందే.. సహకరించకపోతే వారికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించేలా కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం దుమారం రేపుతోంది.

ఈ ఉత్తర్వులపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈరోజు పార్లమెంటులో దీనిపై పోరాడేందుకు నిర్ణయించారు. కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. వ్యక్తిగత స్వేచ్ఛను బీజేపీ ప్రభుత్వం హరిస్తుందని చెప్పారు. ఈరోజు లోక్ సభ - రాజ్యసభలో ఇదే విషయంపై ప్రతిపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి.