Begin typing your search above and press return to search.

ఈ రోజు సెల‌వు ప‌డితే వారికి బోలెడంత న‌ష్టం?

By:  Tupaki Desk   |   1 Jan 2016 9:57 AM GMT
ఈ రోజు సెల‌వు ప‌డితే వారికి బోలెడంత న‌ష్టం?
X
కొత్త సంవ‌త్స‌రం రోజున ఆఫీసుకు వెళ్లి.. సీరియ‌స్ గా ప‌ని చేసేక‌న్నా.. కాస్తంత రిలీఫ్ గా ఉంటుంద‌ని ఆఫీసుకు డుమ్మా కొట్టేవారు చాలామందే ఉంటారు. అలా అనుకొని కానీ ఈ జ‌న‌వ‌రి 1న ఆఫీసుకు డుమ్మా కొట్టే కేంద్ర‌ప్ర‌భుత్వ ఉద్యోగులు భారీగా న‌ష్ట‌పోవ‌టం ఖాయ‌మ‌ట‌. సాంకేతికంగా తీసుకున్న ఒక నిర్ణ‌యంతో ఇలాంటి ఇబ్బంది ఎదురుకానుంది. జ‌న‌వ‌రి 1న ఆపీసుల‌కు వెళ్ల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఒక రోజు ప‌ని దినం కోల్పోవ‌టానికి మించి మ‌రో భారీ న‌ష్టం త‌ప్ప‌దు.

ఏడో వేత‌న స‌వ‌ర‌ణ క‌మిష‌న్ తీర్మానం ప్ర‌కారం చేసిన సిఫార్సుల‌కు కేంద్రం ఓకే చెప్పింది. అయితే.. ఇందులోని నిబంధ‌న‌ల‌న్నీ కూడా సిఫార్సులు అమ‌ల్లోకి వ‌చ్చే జ‌న‌వ‌రి 1న ఆఫీసుల‌కు హాజ‌ర‌య్యే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మాత్ర‌మే అమ‌లు చేయాల‌ని నిబంధ‌న‌లో స్ప‌ష్టంగా పేర్కొన్నారు. దీంతో.. జ‌న‌వ‌రి 1న ఆఫీసుకు వెళ్ల‌టం త‌ప్ప‌నిస‌రి అయ్యింది.

ఒక‌వేళ ఏదైనా కార‌ణం చేత‌.. ఏ ఉద్యోగి అయినా జ‌న‌వ‌రి 1న ఆపీసుకు కానీ వెళ్ల‌ని ప‌క్షంలో.. ఒక‌టో తేదీ నుంచి అమ‌లు అయ్యే వేత‌న స‌వ‌ర‌ణ సిఫార్సులు అమ‌లు కావ‌న్న మాట‌. ఒక‌వేళ ఆ త‌ర్వాత ఆపీసుకు వ‌స్తే.. అప్ప‌టి నుంచి మాత్ర‌మే అమ‌లు అవుతాయి. దీని వ‌ల్ల సీనియార్టీ కోల్పోయే అవ‌కాశం ఉంది. పేరుకు ఒక్క‌రోజు ఆపీసుకు డుమ్మా కొట్టినా.. దాని వ‌ల్ల జ‌రిగే న‌ష్టం మాత్రం చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు.