Begin typing your search above and press return to search.

నిర్భయ దోషులకు ఉరి తీసేందుకు తలారి దొరికాడు

By:  Tupaki Desk   |   12 Dec 2019 5:04 AM GMT
నిర్భయ దోషులకు ఉరి తీసేందుకు తలారి దొరికాడు
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. నేరం చేసి.. నిరూపితమై కోర్టు ఉరిశిక్ష వేసిన తర్వాత కూడా ఏళ్లకు ఏళ్లు జైల్లో గడుపుతున్న నిర్భయ దోషుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం ఎంతలా ఉందన్న విషయం ఇటీవల కాలంలో దిశ ఎపిసోడ్ వేళ చూసిందే. ఏళ్లు గడిచిపోతున్నా.. శిక్ష అమలు కదా? అన్న ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. దిశ నిందితుల విషయంలో సత్వర న్యాయం జరిగిన తర్వాత నిర్భయ దోషులకు కోర్టు విధించిన శిక్షను అమలు చేయాలన్న ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే.

దీని నుంచి బయటపడేందుకు వీలుగా నిర్భయ దోషుల్ని ఉరి తీసేందుకు కేంద్రం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యక్రమాలు మొదలయ్యాయి. నిర్భయ దోషులకు ఉరి అమలు మీద పనులు మొదలైన వెంటనే.. తలారీ సమస్య తెర మీదకు వచ్చింది. ఎందుకంటే.. ప్రస్తుతం దోషులు ఉన్న తీహార్ జైలుకు ఉరిశిక్షను అమలు చేసేందుకు అవసరమైన తలారీ లేరు. ఇలాంటివేళ.. ఒకరిద్దరు తమకు తాముగా దోషుల్ని ఉరి తీస్తామని.. తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా బహిరంగంగా బయటకు వచ్చారు.

అయితే.. మీరట్ జైల్లో ఉన్న తలారీని తీహార్ జైలుకు పంపేలా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తీహార్ జైలు నుంచి యూపీ జైళ్ల శాఖ డీజీకి ఒక లేఖ అందింది. అందులో తీహార్ జైలుకు తలారీని పంపాలని కోరారు. కొందరు నిందితులకు ఉరి వేసేందుకు అని మాత్రమే పేర్కొన్నారు కానీ నిర్భయ దోషుల కోసమన్న విషయాన్ని ప్రస్తావించలేదు.

ఇక.. యూపీ మొత్తంగా చూస్తే ఇప్పుడు ఇద్దరు తలారులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అందులో ఒకరు మీటర్ జైలు తలారి పవన్ కుమార్. గతంలో ఇదే పవన్ కుమార్ తనకు రావాల్సిన నెలసరి వేతనం కోసం ఆఫీసర్ల చుట్టూ తిరిగిన వైనం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. నిఠారి సీరియల్ కిల్లర్ సురేందర్ కోలికి విధించిన ఉరిశిక్షను అమలు చేసింది పవన్ కుమారే. ఇప్పుడు ఆయనే నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేస్తారని చెబుతున్నారు.