Begin typing your search above and press return to search.

ఆ నాలుగు గ్రామాల రైతులకూ నష్టమే

By:  Tupaki Desk   |   16 Dec 2015 4:56 PM GMT
ఆ నాలుగు గ్రామాల రైతులకూ నష్టమే
X
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఎవరు ఎక్కడ భూములు ఇస్తే అక్కడే వారికి స్థలాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, నాలుగు గ్రామాల ప్రజలను మాత్రం ఇప్పుడు ఈ నిబంధన నుంచి మినహాయిస్తోంది. ఆ నాలుగు గ్రామాలూ కూడా అత్యంత కీలకమైన కోర్ కేపిటల్ లో ఉండే గ్రామాలే కావడం విశేషం.

రాజధాని ప్రాంతంలోని రాయపూడి - ఉద్ధండరాయునిపాలెం -లింగాయపాలెం - మందడం గ్రామాల్లో ప్రభుత్వం కోర్ కేపిటల్ ను నిర్మిస్తోంది. అంటే, సచివాలయం - అసెంబ్లీ - ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం - మంత్రుల కార్యాలయాలు - ప్రభుత్వ శాఖలు తదితరాలన్నీ ఇక్కడే వస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించే చోట వాణిజ్యానికి ఏమాత్రం అవకాశం ఉండరాదని, మరీ ముఖ్యంగా అక్కడ రియల్ ఎస్టేట్ కు అవకాశం ఉండరాదని ప్రభుత్వం భావిస్తోంది. దీనిని గవర్నమెంట్ కోర్ అని కూడా పిలుస్తోంది. దాదాపు 15 కిలోమీటర్ల పరిధిలోని ఈ నాలుగు గ్రామాల్లోనూ ప్రభుత్వ భవనాలు తప్ప ఇంక ఏమీ నిర్మించరాదని నిర్ణయించింది.

దాంతో ఇక్కడి నాలుగు గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతులకు వాటి సమీప గ్రామాల్లో భూములు ఇవ్వాలని భావిస్తోంది. ఉదాహరణకు రాయపూడిలో జరీబు భూములు ఇచ్చిన రైతులకు దాని పక్కనున్న అబ్బరాజుపాలెంలో, మెట్ట రైతులకు తుళ్లూరులో, మందడంలో జరీబు భూములు ఇచ్చిన రైతులకు వెంకటపాలెంలో, మెట్ట రైతులకు వెలగపూడిలో ఇలా భూములు ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో కృష్ణా నది ఒడ్డున ప్రభుత్వ సచివాయలం, అసెంబ్లీ తదితరాలు ఉండే చోట తమకు భూములు వస్తే వాటికి అత్యధిక ధర ఉంటుందని భావించిన రైతులు ఇప్పడు తమకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.