Begin typing your search above and press return to search.

ఆంధ్ర రాజధాని కూడా వెనుకబడిన ప్రాంతమే

By:  Tupaki Desk   |   19 Aug 2015 4:41 AM GMT
ఆంధ్ర రాజధాని కూడా వెనుకబడిన ప్రాంతమే
X
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. వరాలకు తక్కువ. ప్రస్తుతం ప్రధాని మోడీ వైఖరి చూస్తే.. ఇదే మాట గుర్తుకు రాక మానదు. సాయం చేయాల్సి వస్తే.. అత్యంత పీనాసితనంగా వ్యవహరిస్తూ.. ఆచితూచి నిధులు రాల్చే ప్రధాని మోడీ.. తనకు అవసరమైతే ఎంతకైనా సిద్ధమేనన్నట్లుగా వ్యవహరిస్తారన్న విషయం బీహార్ కు ప్రకటించిన ప్యాకేజీని చూసినప్పుడు అర్థమవుతుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఓ పక్క బీహార్ కు రూ.1.65లక్షల కోట్లు (ప్రత్యేక ప్యాకేజీ రూ.1.25లక్షల కోట్లు.. రూ.40వేల కోట్లు గతంలో ఇచ్చి.. అమలు కాని హామీలు) ఇంత భారీ ప్యాకేజి ప్రకటించిన రోజునే.. బీహార్ కు మేలు కల్పిస్తూ.. మరో నిర్ణయాన్ని తీసేసుకున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. బీహారీల మనసుల్ని గెలుచుకోవాలన్న ఒకే ఒక్క అజెండాతో ముందుకెళుతున్న మోడీ సర్కారు.. ఆ రాష్ట్రంలోని 21 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం పుణ్యమా అని.. ఈ జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ఆదాయపన్నులో 15 శాతం మినహాయింపు లభిస్తుంది. దీనికి సంబంధించి ప్రత్యక్ష పన్నుల సంఘం సోమవారమే ఒక ప్రకటన జారీ చేసేసింది కూడా. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ వెనుకబడిన జిల్లాల జాబితాలో బీహార్ రాష్ట్ర రాజధాని అయిన పాట్నా కూడా ఉండటం. రాష్ట్ర రాజధాని ప్రాంతం కూడా వెనుకబడిన ప్రాంతంగా గుర్తించారంటే మోడీ సర్కారు బీహార్ మీద ఎంత ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.