Begin typing your search above and press return to search.

ఏపీకి కేంద్రం షాక్‌..విశాఖ ఉత్స‌వ్‌ కు నేవీ నో

By:  Tupaki Desk   |   28 Dec 2018 12:26 PM GMT
ఏపీకి కేంద్రం షాక్‌..విశాఖ ఉత్స‌వ్‌ కు నేవీ నో
X
కేంద్ర ప్ర‌భుత్వం - ఆంధ్ర‌ప్రదేశ్ స‌ర్కారు మ‌ధ్య వివిధ అంశాల వాదోప‌వాదాలు కొన‌సాగుతున్నాయి. రాష్ట్రంలోనే ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ నగరాన్ని పర్యాటక రంగంలో కూడా మరింత ప్రోత్సహం అందించేందుకు ఏటా డిసెంబర్‌ లో మూడు రోజుల పాటు నిర్వహించే విశాఖ ఉత్సవ్ నిర్వహణకు రంగం సిద్దమైంది. ఈ నెల 28 నుంచి 30 వరకూ మూడు రోజుల పాటు విశాఖ ఆర్కేబీచ్‌ లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. తొలి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ ఉత్స‌వాల్లో పాల్గొనే నేవీ సిబ్బందిని వెన‌క్కి రప్పించిన‌ట్లు స‌మాచారం. ఈ ప‌రిణామం ఏపీ స‌ర్కారు ఊహించ‌లేద‌ని తెలుస్తోంది

విశాఖ ఉత్సవాల్లో నేటి నుంచి ప్రారంభంకావాల్సిన ఎయిర్ షో రద్దయింది. కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో విన్యాసాలను రద్దు చేశామని అధికారులు తెలిపారు. విశాఖ తీరంలో 9 యుద్ధ విమానాలతో 90 మంది సిబ్బందితో ఎయిర్ షో కు ప్రణాళికలు సిద్ధం చేశారు. గత వారం ఎయిర్‌ షో నిర్వాహకులు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌ - ఇతర ప్రాంతాలను పరిశీలించి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరుతూ రక్షణ శాఖకు లేఖ పంపినప్పటికీ కేంద్రం అనుమతి నిరాకరించినట్లు సమాచారం. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. విశాఖ ఉత్సవ్ లో ఎయిర్ షో కూడా నిర్వహించకుండా కేంద్రం అడ్డుకుందని ఆరోపించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ భాగం కాదు అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోందని సీఎం వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండ‌గా, ఇప్పటికే విశాఖ ఉత్సవ్ పండుగకు నగరం ముస్తాబు అవుతుంది. నగరంలోని ప్రధాన కూడళ్లు రంగులతో సొబగులు అద్దారు. దీనిలో భాగంగానే బీచ్‌ రోడ్డులోని ప్రధాన వేదికతోపాటు - నమూనా దేవాలయాలు - పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ - బారికేడ్లతో గేట్లు ఏర్పాటు చేశారు. ఉత్సవ్‌ కు వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యాటక - జీవీఎంసీ ఇతర శాఖల అధికారులు - ఉత్సవ్ కోసం ప్రత్యేకంగా నియమించిన అధికారులు పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఈ ఉత్సవ్‌ కు సీఎం వస్తుండడంతో ఎటువంటి భద్రతా లోపం - ట్రాఫిక్ సమస్య కూడా లేకుండా తగిన ఏర్పాట్లను పోలీస్ అధికారులు చేపడతున్నారు. అలాగే జిల్లాలోని సీఎం పర్యటన నేపథ్యంలో అనకాపల్లి మండలంలో బీసీ - ఎస్సీ - ఎస్టీ - మైనార్టీలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆదరణ పథకంలో మూడో విడత మెగా గ్రౌండింగ్ మేళా ద్వారా లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేయనున్నారు.