Begin typing your search above and press return to search.

బాబు నిర్ణ‌యంతో వ‌ణికిపోతున్న అధికారులు

By:  Tupaki Desk   |   9 Sep 2015 4:39 PM GMT
బాబు నిర్ణ‌యంతో వ‌ణికిపోతున్న అధికారులు
X
సాధ్యమైంత త్వర‌గా ఏపీ పాల‌న‌ను విజ‌య‌వాడ నుంచి సాగించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణ‌యం కొంద‌రు అధికారుల‌కు మింగుడు ప‌డ‌టం లేదా? చంద్ర‌బాబు నిర్ణ‌యం స‌మంజ‌సంగానే ఉన్న‌ప్ప‌టికీ కొన్ని ఇత‌ర కారణాలు అడ్డుప‌డుతున్నాయా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

సీఎం చంద్ర‌బాబు ఈ మధ్య వారానికి అయిదారు రోజులు విజ‌య‌వాడ‌లోనే మకాం వేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు బాబు అడుగులు వేస్తున్నారు కూడా. కొన్ని శాఖ‌లను గుర్తించి ముందుగా హైద‌రాబాద్ నుంచి వాటిని త‌ర‌లించాల‌ని బాబు భావిస్తున్నారు. శాఖ‌లు పూర్తిస్థాయిలో త‌ర‌లి వెళ్తే ఉన్నతాధికారులు కూడా మూటాముల్లె సర్దుకుని వెళ్లాల్సి ఉంటుంది. మ‌రోవైపు రెండు రాష్ట్రాల మ‌ధ్య ఐఏఎస్‌ల కేటాయింపులు పూర్తి కావ‌డంతో... ఎక్కడి వారు అక్కడ చేరిపోయారు. మామూలుగానైతే కాస్త ప‌లుకుబ‌డి, పరపతి ఉండే శాఖ‌ల్లో పోస్టుల కోసం ఐఏఎస్‌ లు లాబీయింగ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి రివ‌ర్సైంది. ఏపీకి కేటాయించిన ఐఎఎస్ అధికారుల్లో కొంద‌రు కీల‌క పోస్టులు వ‌ద్దంటున్నారట. చిన్న పోస్టైనా చాల‌ని స‌ర్దుకుపోతున్నారట‌.ఐఏఎస్‌ లలో ఏంటా ఇంత మార్పు అని ఆరా తీస్తే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

హైద‌రాబాద్‌ ను వ‌దిలి వెళ్లడం ఇష్టంలేని ఐఎఎస్‌ ల‌కు బాబు నిర్ణ‌యం ఎంతమాత్రం మింగుడుపడటంలేదు. విజ‌య‌వాడ‌లో వ‌ర్షాకాలంలో టెంపరేచర్‌ ని తట్టుకోవడమే చాలా క‌ష్టంగా ఉంద‌ని... ఇక సమ్మర్‌ లో అస్సలు ఉండ‌లేమ‌న్న చర్చ ఐఏఎస్‌ వర్గాల్లో జరుగుతోంది. హైద‌రాబాద్‌ సదుపాయాల‌కు అల‌వాటుప‌డ్డ అధికారులు... ఇక్కడి నుంచి కాలు క‌ద‌ప‌డానికి ఏ మాత్రం ఇష్టప‌డ‌టంలేదట. అందుకే కీల‌క పోస్టులు ఆఫ‌ర్ చేస్తున్నా వ‌ద్దు వ‌ద్దని అంటున్నార‌ట‌. టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక కేంద్ర స‌ర్వీసుల నుంచి సీఎం కార్యాల‌యానికి వ‌చ్చిన గిరిధ‌ర్... కొన్ని కార‌ణాల వ‌ల్ల మునిసిప‌ల్ శాఖ ముఖ్య కార్యద‌ర్శిగా వెళ్లాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత అక్కడ ప‌ని చేయ‌డం ఇష్టంలేని గిరిధ‌ర్ బ‌దిలీ కోరుకున్నారు.

రెండు మూడు కీల‌క శాఖ‌ల‌ను ఆయ‌న‌కు ఆఫ‌ర్ చేసిన‌ప్పటికీ తీసుకోడానికి ఇష్టప‌డ‌ని గిరిధ‌ర్... ఏపీపీఎస్సీ కార్యద‌ర్శిగా వెళ్లిపోయారు. దీనికి కార‌ణం ఏపీపీఎస్సీ అయితే విజ‌య‌వాడ వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ట‌. హైద‌రాబాద్‌ లోనే ఉండి ప‌ని చేసుకోవ‌చ్చన్నది ఆయన ఆలోచనట‌.గిరిధ‌ర్ ఒక్కరే కాదు... ఏపీకి కేటాయించిన చాలా మంది ఐఎఎస్‌ల ఆలోచన ఇలాగే ఉందంటున్నారు. హైదరాబాద్‌ లో ఉండే పోస్టులపైనే చాలామంది దృష్టిపెట్టారట. కొంత మంది మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కార్యద‌ర్శి పోస్టు కోసం ప్రయ‌త్నిస్తున్నార‌ట‌. మామూలుగానైతే అంతగా ఫోకస్‌ లో లేని ఐఎఎస్‌ ల‌ను ఇలాంటి పోస్టుల‌కు పంపుతుంటారు. మారిన ప‌రిస్థితుల్లో ఇదివరకు ఎవ‌రికీ కొర‌గాని పోస్టుల‌కే ఇప్పుడు గిరాకీ పెరిగింద‌ని తెలుస్తోంది.