Begin typing your search above and press return to search.

కేటీఆర్ - గ్రామస్థుడిపై అధికారి బూతులు

By:  Tupaki Desk   |   27 Aug 2019 5:50 AM GMT
కేటీఆర్ - గ్రామస్థుడిపై అధికారి బూతులు
X
ప్రభుత్వ అధికారులు అంటే ఎవరు..? ప్రజలకు సేవ చేసేందుకు నియమించిన ఉద్యోగులు. కానీ ప్రజల సమస్యలను తీర్చక పోగా.. వారిపైనే జులం ప్రదర్శిస్తే ఏమనాలి..? ఏకంగా ప్రజలకు సంక్షేమం పంచుతున్న ప్రజాప్రతినిధులపై కూడా బండ బూతులు తిట్టిన వైనం ఇప్పుడు నల్గొండ జిల్లాలో కలకలం రేపుతోంది.

నల్గొండ చండూరు మండలంలోని అంగడిపేట గ్రామస్థుడు తాజాగా ఆ మండలంలో రెండు కీలక శాఖలు చూస్తున్న బాధ్యుడైన అధికారికి ఫోన్ చేసి తమ సమస్యలను తీర్చమని కోరాడు. రేపు ఊరిలో బోనాల పండుగ నిర్వహిస్తున్నామని.. వానలతో వీధులన్నీ కంపు కొడుతున్నాయని.. బురదమయంగా మారాయని.. జర రిపేర్ చేయమని ఫోన్లో విన్నవించాడు..

దీనికి కోపోద్రిక్తుడైన సదురు అధికారి.. ‘నన్నే చేయమంటావ్’ అంటూ గద్దించాడు. దీనికి గ్రామస్థుడు మొన్ననే కేటీఆర్ సార్ మా చండూరు మున్సిపాలిటీకి రూ.10 కోట్లు ఇచ్చినట్టు పేపర్లో వచ్చిందని.. నల్గొండకు 100 కోట్లు కేటాయించారని.. జర పనిచేసిపెట్టండి అని మర్యాదగా కోరాడు.

అయితే ఈ మాటలకు చిర్రెత్తుకొచ్చిన సదురు అధికారి గ్రామస్థుడిపై - కేటీఆర్ పై బండబూతులు తిట్టడం సంచలనంగా మారింది. ‘ఎవడో పేపర్ల రాస్తడట.. ఇంకెవడో కేటీఆర్ (బూతుపదం) ఇచ్చాడంటూ అంటూ బూతు పదాన్ని జోడించి తిట్టేశాడట.. 10 కోట్లు ఇస్తే కోటి లోపలేసుకొని ఉద్యోగమే నేను చేయను అంటూ గద్దించాడట..

దీంతో హతాషుడైన గ్రామస్థుడు.. తాము టీఆర్ ఎస్ కార్యకర్తలమని.. నిధులు లేవంటున్న మీ మాటలు విని ప్రగతి భవన్ వెళ్లి కలిసి వస్తామని బదులిచ్చాడు. దీనికి కూడా ఫైర్ అయిన అధికారి ఆ పోయిరా అంటూ 10 కోట్లు ఇచ్చారా..? అని బూతు దండకం మొదలు పెట్టాడు..

గ్రామస్థుడి ఫోన్లో ఆడియో రికార్డు ఉండడం.. ఇదంతా రికార్డ్ కావడంతో ఆ అధికారి బాగోతం ఇప్పుడు బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గ్రామస్థుడిని - కేటీఆర్ ను తిట్టిన అధికారి ఇష్యూ ఇప్పుడు వివాదాస్పదమైంది.