Begin typing your search above and press return to search.

తెలుగు అధికారులకు ‘సోమవారం’ చుక్కలు

By:  Tupaki Desk   |   10 Jan 2017 7:17 AM GMT
తెలుగు అధికారులకు ‘సోమవారం’ చుక్కలు
X
అసలే సోమవారం అంటేనే ఒకలాంటి నీరసంగా ఉంటుంది. సెలవు తర్వాతి రోజు మరింత ఉత్సాహంగా పని చేయాల్సింది పోయి.. నీరసం ఎందుకంటే కారణం లేకపోలేదు. గతంలో వారాంతం అంటే విశ్రాంతి తీసుకోవటం.. కుటుంబంతో గడపటం. కానీ.. మారిన లైఫ్ స్టైల్ తో ఇప్పుడు పరిస్థితి మారిపోయాయి. వారాంతం వస్తుందంటే చాలు.. ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి? అన్నది చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ప్లాన్ చేసేకుంటున్నారు.

వీలైనంతవరకూ బయట ఉండటానికే ఎక్కువమంది ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో.. వారాంతం తర్వాత వచ్చే స్టార్టింగ్ డే అయిన సోమవారం అంటే మరింత నీరసంగా మారుతుంది. ఇదిలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల అధికారులకు మండే అంటే చాలు మంటలు పుట్టిస్తున్నాయి. ఇందుకు రెండు రాష్ట్రాల పాలకుల నిర్ణయాలే కారణంగా చెప్పక తప్పదు.

ఏపీ ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు పనుల్ని ప్రతి సోమవారం పర్యవేక్షిస్తానని చెప్పటమే కదు.. ఆ రోజున ఎన్ని పనులు ఉన్నా.. ఆయన సమీక్షతో అదరగొట్టేస్తున్నారు. పనుల్లో భాగంగా.. పలు విభాగాలు దీని కిందకు రావటంతో.. వారానికి వారానికి మధ్య అప్ డేషన్ ను సోమవారం చెప్పాల్సిన రావటం అధికారుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోమవారం అంటే.. పోలవరం ప్రాజెక్టు రివ్యూ పక్కా అన్నట్లుగా మారిపోయిన నేపథ్యంలో.. వారాంతం వస్తుందంటే చాలు.. సోమవారం పోలవరంపై రివ్యూ బెంగ అధికారులకు పట్టుకుంది.

ఇదిలా ఉంటే.. కొత్తగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ అధికారులకు ఇప్పుడు కొత్త ఇబ్బందుల్ని తెచ్చి పెడుతోంది. ఉన్నట్లుండి చేనేత వస్త్రాలపై ఆయనకు విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చింది. ప్రభుత్వ అధికారులంతా సోమవారం చేనేత వస్త్రాల్ని ధరించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే.. అదో రూల్ గా మారటమే ఇప్పుడు సమస్యగా మారింది.

నిన్నటికి నిన్న చేనేత వస్త్రాల్ని ధరించలేదన్న కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ నిర్వహించిన ప్రజావాణికి హాజరైన అధికారుల్ని తిప్పి పంపటం చర్చనీయాంశంగా మారింది. చేనేత కార్మికుల్ని ఆదుకోవాలనుకోవటం తప్పేం కాదు. కానీ.. ప్రతిది తప్పనిసరి అని బలవంతంగా చేనేత వస్త్రాలు ధరించేలా చేయటం సరికాదన్న వాదన వినిపిస్తోంది. ఇదే తీరు వరంగల్ జిల్లా కలెక్టర్ గా వ్యవహరిస్తున్న అమ్రపాలి ఖాదీ చీరతో రివ్యూ మీటింగ్ కు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు చేనేత వస్త్రాలు ధరించని తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా పరిణామాలతో.. సోమవారం వస్తుందంటే చాలు.. రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/