Begin typing your search above and press return to search.

కేసీఆర్ సొంత జిల్లా ఎవ‌రికీ వ‌ద్ద‌ట‌!

By:  Tupaki Desk   |   25 Feb 2017 10:37 AM GMT
కేసీఆర్ సొంత జిల్లా ఎవ‌రికీ వ‌ద్ద‌ట‌!
X
తెలంగాణ సీఎం కేసీఆర్‌... పాల‌న‌లో త‌న‌దైన దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అధికారులకు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తూ మంచి పాల‌కుడిగానూ పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు బెస్ట్ సీఎం అవార్డు కూడా వ‌చ్చింది. తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాట‌య్యేలా సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసిన కేసీఆర్‌... తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డిన మూడేళ్ల‌లోనే ప‌ది జిల్లాల‌తో ఏర్ప‌డిన రాష్ట్రాన్ని 31 జిల్లాలున్న రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. పాల‌నా సౌల‌భ్యం కోస‌మే కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై ప‌లువురు విస్మ‌యం వ్య‌క్తం చేసినా కేసీఆర్ ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ఆయా జిల్లాల‌కు క‌లెక్ట‌ర్లు - ఎస్పీల‌ను కేటాయించేసిన కేసీఆర్‌.. కొత్త జిల్లాల్లో పాల‌న‌ను దాదాపుగా ప‌ట్టాలెక్కించేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కేసీఆర్ సొంత ప్రాంత‌మైన సిద్దిపేట కూడా ఓ జిల్లాగా ఏర్పాటైంది. అన్ని జిల్లాల ప‌రిస్థితి ఎలా ఉన్నా... ఆయా జిల్లాలు ఎలా ఉండ‌బోతున్నాయో చూపేందుకు సిద్దిపేట‌పై కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టి సారించారు.

ఈ క్ర‌మంలో సిద్దిపేట జిల్లా క‌లెక్ట‌రేట్ స‌ముదాయాన్ని నిర్మించేందుకు స్థ‌ల ప‌రిశీలన కూడా పూర్తి చేశారు. త్వ‌ర‌లోనే ఈ ప‌నులు కూడా ప్రారంభం కానున్నాయి. కేసీఆర్‌ సొంతూరు చింత‌మ‌డ‌క సిద్దిపేట‌కు కూత‌వేటు దూరంలో ఉండ‌గా... సిద్దిపేట‌నే కేసీఆర్ సొంతూరుగా పేరు ప‌డిపోయింది. హైద‌రాబాదుకు మ‌కాం మార్చినా... కేసీఆర్‌ కు ఇప్ప‌టికీ సిద్దిపేట‌లో ఓ ఇల్లు కూడా ఉంది. అయినా ఇప్పుడు ప్ర‌త్యేకంగా సిద్దిపేట ప్ర‌స్తావ‌న ఎందుక‌నేగా మీ ప్ర‌శ్న‌. అక్క‌డికే వ‌స్తున్నాం. సిద్దిపేట ఒక్క కేసీఆర్‌ కే కాకుండా ఆయ‌న మేన‌ల్లుడు త‌న్నీరు హ‌రీశ్ రావు కు కూడా సొంతూరే. ప్ర‌స్తుతం హ‌రీశే సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ కేబినెట్‌ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ఉన్నారు. కేసీఆర్‌, ఆయ‌న అల్లుడు హ‌రీశ్ రావుల‌కు చెందిన జిల్లాగా సిద్దిపేట‌కు అత్యంత ప్రాధాన్య‌మే ఉంది.

ఈ జిల్లాలో ప‌నిచేయాల‌ని కోరుకోని అధికారులు ఉంటారా? సాధార‌ణంగా అయితే ఉండ‌రు. త‌మ స‌ర్వీసులో క‌నీసం ఓ నెల అయినా అక్క‌డ ప‌నిచేయాల‌ని కోరుకుంటారు. అయితే ప్ర‌స్తుతం సిద్దిపేటలో ప‌రిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఆ జిల్లాలో ప‌నిచేసేందుకు అధికారులు సిద్ధంగా లేరు క‌దా... సాధార‌ణ బ‌దిలీల్లో అక్క‌డికి పోస్టింగ్ వ‌స్తే కూడా వెళ్లేందుకు జ‌డుసుకుంటున్నార‌ట‌. ముఖ్యంగా రెవెన్యూ శాఖ‌లో కీల‌క స్థాన‌మైన త‌హ‌శీల్దార్ పోస్టుల‌కు సంబంధించి అక్క‌డ ప‌నిచేయాలంటేనే... త‌హ‌శీల్దార్లంతా హ‌డ‌లెత్తిపోతున్నారు. ఎందుక‌ని ఆరా తీస్తే... కార‌ణాలు చెప్పేందుకు నిరాక‌రిస్తున్న త‌హ‌శీల్దార్లు... సిద్దిపేట జిల్లాలో అయితే తాము ప‌నిచేయ‌లేమ‌ని మాత్రం తెగేసి చెబుతున్నార‌ట‌. ఈ విష‌యం కేసీఆర్‌ - హ‌రీశ్ రావుల దృష్టికి వెళ్లిందో.. లేదో తెలియ‌దు కాని... ఈ ప‌రిస్థితి ఎప్పుడు మారుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/