Begin typing your search above and press return to search.

సీఎం హెలికాఫ్ట‌ర్ల‌ను వాడ‌కుండా గూగుల్ తోనే కుస్తీ!

By:  Tupaki Desk   |   3 July 2019 5:13 AM GMT
సీఎం హెలికాఫ్ట‌ర్ల‌ను వాడ‌కుండా గూగుల్ తోనే కుస్తీ!
X
గోదావ‌రి నీళ్ల‌ను కృష్ణ‌లో క‌లిపి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు భారీ ఎత్తున మేలు చేయాల‌ని త‌పిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కొత్త ప్రాజెక్టు ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌న్న ఆలోచ‌న‌తో ఈ మ‌ధ్య‌నే ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు భేటీ కావ‌టం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా తెర మీద‌కు తెచ్చిన కొత్త ప్రాజెక్టు లెక్క‌లు తేల్చేందుకు రెండు రాష్ట్రాల‌కు చెందిన ఇంజినీర్లు క‌స‌రత్తు చేయాల‌ని కోరారు. అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా రెండు రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు రియాక్ట్ అవుతూ.. అధికారులు త‌మ చ‌ర్చ‌ల్లో భాగంగా ప్రాక్టిక‌ల్ గా ప‌రిస్థితుల్ని ప‌రిశీలించేందుకు వీలుగా తాము వినియోగించే హెలికాఫ్ట‌ర్ల‌ను వాడుకోవాల్సిందిగా కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అధికారుల‌కు ఈ ఆఫ‌ర్ ను ఇచ్చారు.

ముఖ్య‌మంత్రులు పెద్ద మ‌న‌సుతో హెలికాఫ్ట‌ర్ తో వాడుకొమ్మ‌ని చెప్పినా.. రెండు రాష్ట్రాల‌కు చెందిన నీటిపారుద‌ల శాఖాధికారులు కానీ.. మిగిలిన టీం కానీ సీఎంల హెలికాఫ్ట‌ర్ ను వాడుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. సీఎంల మ‌ధ్య స‌మావేశం ముగిసిన త‌ర్వాత గోదావ‌రి నీళ్ల‌ను కృష్ణా ప‌రివాహాక ప్రాంతానికి త‌ర‌లించే విష‌య‌మై గ‌డిచిన కొద్ది రోజులుగా ఏపీ.. తెలంగాణల‌కు చెందిన ఉన్న‌త అధికారులు.. ప్ర‌ముఖులు చ‌ర్చ‌ల మీద చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల మీద చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. త‌మ వాద‌న‌ల‌కు త‌గ్గ ఆధారాలుగా గూగుల్ మ్యాప్ లు.. ట్రోపో పిక్చ‌ర్ల‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకొని మ‌రీ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అవ‌కాశం ఇచ్చారు క‌దా అని హెలికాఫ్ట‌ర్ ను వాడేందుకు ఇరు రాష్ట్రాల‌కు చెందిన ఉన్న‌తాధికారులు ఆస‌క్తి చూప‌టం లేదంటున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల ఆకాంక్ష‌ను నెర‌వేర్చేసే క్ర‌మంలో ఏ రాష్ట్రానికి న‌ష్టం వాటిల్ల కూడ‌ద‌న్న రీతిలో తాజా చ‌ర్చ‌లు సాగుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టికే ఉన్న మార్గాల‌తో పాటు.. వీటికి అద‌నంగా మ‌రింకేమైనా మార్గాలు ఉన్నాయా? అన్న అంశంపైనా రెండు రాష్ట్రాల అధికారులు మేథోమ‌ధ‌నం చేస్తున్నారు. వాడుకొమ్మ‌న్నంత‌నే వాడేసే అధికారుల తీరుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.