Begin typing your search above and press return to search.

బాబు మాట‌ల‌తో మ‌ధ్య‌లో వెళ్లిపోయిన అధికారులు

By:  Tupaki Desk   |   4 May 2019 5:13 AM GMT
బాబు మాట‌ల‌తో మ‌ధ్య‌లో వెళ్లిపోయిన అధికారులు
X
ప్ర‌తి విష‌యాన్ని రాజ‌కీయంగా చూస్తే.. రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేస్తూ.. మొత్తం వ్య‌వ‌హారాన్ని రాజ‌కీయం చేయ‌టం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు వెన్న‌తో పెట్టిన విద్య‌. వాతావ‌ర‌ణం అనుకూలంగా లేన‌ప్పుడు కాస్త వెన‌క్కి త‌గ్గితే పోయేదేమీ లేదు. ఎన్నిక‌లు పూర్తి అయి.. ఫ‌లితం కోసం ఎదురుచూస్తున్న సంధిద‌శ‌లో ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగానే ఉంటుంది. అందునా.. ఈసీ క‌ఠినంగా ఉన్న‌ప్పుడు.. పైనుంచి వ‌చ్చే ఆదేశాలు సానుకూలంగా లేన‌ప్పుడు.. మ‌ధ్య‌లో అధికారులు ఏం చేయ‌గ‌ల‌రు?

ఇలాంటి సంద‌ర్భాల్ని చూసి.. అందుకు త‌గ్గ‌ట్లుగా వ్య‌వ‌హ‌రించాల్సిన చంద్ర‌బాబు.. అందుకు భిన్నంగా వేస్తున్న చిందులు.. ఇప్పుడు విసుగు తెప్పిస్తున్నాయి. ఎన్నిక‌ల్లో ప్ర‌తికూల ఫ‌లితం ఖాయ‌మ‌న్న మాట అంద‌రి నోట వినిపిస్తున్న వేళ‌.. నిన్న‌టి వ‌ర‌కూ విధేయులుగా ఉన్న వారు సైతం సీన్ మారే వేళ‌ ముఖం చాటేసే ప‌రిస్థితి. అలాంటిది.. ప్ర‌భుత్వ అధికారుల తీరు ఎలా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

రాజ‌కీయ నేత‌గా చంద్ర‌బాబు వంద అంటారు. కానీ.. మ‌ధ్య‌లో అందులో తాము ఇరుక్కుంటే త‌ర్వాత త‌మ ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న విష‌యం అధికారుల‌కు తెలియంది కాదు. అందుకే.. బాబు తీరుకు ఆయ‌న స్టైల్లోనే స‌మాధానం ఇచ్చారు అధికారులు.

తాజాగా అమ‌రావ‌తిలో విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించే క్ర‌మంలో కొంద‌రు అధికారుల్ని ఆహ్వానించారు. ఈ నేప‌థ్యంలో ఆర్జీజీఎస్ సీఈవో బాబుతో పాటు మ‌రికొంద‌రు అధికారులు త‌ప్ప‌నిస‌రిగా రావాల్సిన ప‌రిస్థితి. అయితే.. తుపాను స‌హాయ‌క చ‌ర్య‌ల మీద మాట్లాడే క్ర‌మంలో.. త‌న మాట‌ల్ని రాజ‌కీయాల వైపు మ‌ళ్లించి..

ఎన్నిక‌ల సంఘం మీదా.. రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మీద విమ‌ర్శ‌ల దాడి మొద‌లుపెట్టిన వెంట‌నే.. అక్క‌డున్న అధికారులు బాబు స‌మావేశం నుంచి నిష్క్ర‌మించారు. త‌న తీరు కార‌ణంగా అధికారుల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌న్న క‌నీస స్పృహ బాబుకు లేక‌పోవ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

మీడియా స‌మావేశంలో రాజ‌కీయాలు మాట్లాడ‌కుండా బాబు ఉండ‌లేరు. అలాంట‌ప్పుడు అధికారుల్ని పంపేసి మీడియాతో త‌న‌కు తోచిన‌ట్లుగా మాట్లాడితే హుందాగా ఉండేది. అంతేకాదు.. ప‌లువురి మ‌న‌సు దోచుకునే వారు కూడా. అందుకు భిన్నంగా త‌మ‌ను బుక్ చేసేలా బాబు తీరు ఉంద‌ని అధికారులు వాపోతున్నారు. ఎన్నిక‌ల సంఘం మీదా.. రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మీద గుర్రుగా ఉన్న బాబు వారిపై పోరాడాలంటే పోరాడాలి. కానీ.. మ‌ధ్య‌లో ఎలాంటి సంబంధం లేని ఉద్యోగుల్ని బ‌లిప‌శువుల్ని చేసే ప్రోగ్రాంను బాబు మానుకుంటే మంచిద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.