Begin typing your search above and press return to search.
ప్రభుత్వ పాఠశాల ప్రమోషన్ కు `రంగస్థలం`పాట!
By: Tupaki Desk | 26 May 2018 5:27 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ - విలక్షణ దర్శకుడు సుకుమార్ ల దర్శకత్వంలో తెరకెక్కిన `రంగస్థలం` చిత్రం రికార్డు కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలోని పాటలు మాస్ - క్లాస్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండడం సినిమాకు అదనపు బలం. ఆ సినిమాలో జానపద గాయకుడు శివ నాగులు పాడిన `ఆ గట్టునుంటావా నాగన్న....ఈ గట్టునుంటావా` అన్న పాట బాగా పాపులర్ అయింది. రాబోయే ఎలక్షన్లలో ఈ పాటను అన్ని పార్టీల వారు విచ్చలవిడిగా తమ ప్రచారానికి వాడుకుంటారని అంతా అనుకున్నారు. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఈ పాటకు స్పూఫ్ లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పాటను ఓ ప్రభుత్వ పాఠశాల వారు వినూత్న తరహాలో వాడుకున్నారు. తమ బడిలో పిల్లలను చేరమంటూ ఏకంగా ఈ పాట పల్లవిని వాడేసుకొని ఫ్లెక్సిలు కట్టేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఫ్లెక్సీల ఫొటోలు వైరల్ అయ్యాయి.
జీవితంతో కళలు ముడిపడి ఉన్నాయనడంలో సందేహం లేదు. వివిధ రూపాలలోని ఆ కళలను మనుషులు నిజ జీవితంలో వాడుకున్న సందర్భాలు అనేకం. కొన్ని సామాజిక స్పృహ ఉన్న సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేశాయి. శ్రీమంతుడు....సినిమా వల్ల గ్రామాల దత్తత కాన్సెప్ట్ పాపులర్ అయితే,....భరత్ అనే నేను చిత్రం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య కాన్సెప్ట్ పాపులర్ అయింది. అందుకే, తల్లిదండ్రులను ఆకర్షించేందుకు తూర్పు గోదావరి జిల్లాలోని కాజులూరు గ్రామంలో ఉన్న మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల(ఇంగ్లిషు మీడియం) ఉపాధ్యాయులు వినూత్న తరహాలో పబ్లిసిటీ చేస్తున్నారు. రంగస్థలంలో చంద్రబోస్ రచించిన పాటను స్పూఫ్ చేశారు. ``ఆ గట్టునుంటావా విద్యార్థి ...ఈ గట్టుకొస్తావా...ఆ గట్టునేమో 20 వేల ఖర్చు ఉంది...ఈ గట్టునేమో నాణ్యమైన చదువు ఉంది`` అంటూ గ్రామంలో ఫ్లెక్సీలు కట్టేశారు. ప్రైవేటు స్కూళ్లను...గవర్నమెంటు స్కూళ్లతో పోలుస్తూ....వారు చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అయింది.