Begin typing your search above and press return to search.

రెడీగా ఉండండి..రూ.100 కాయిన్ వచ్చేస్తోంది

By:  Tupaki Desk   |   13 Sep 2017 4:37 AM GMT
రెడీగా ఉండండి..రూ.100 కాయిన్ వచ్చేస్తోంది
X
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఆల్ ఇండియా అన్నాద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ తెలుసుకదండీ మీకు. విలక్షణ రాజకీయాలకు పెట్టింది పేరైన తమిళనాడులో తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని నెంబర్ వన్ హీరోగా రాణించారు. తర్వాత అన్నాదురై ఏర్పాటు చేసిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)లో కరుణానిధితో కలిసి పనిచేశారు. ఇద్దరి మధ్య ఏర్పడిన పొరపొచ్చాలతో విడిపోయి సొంతంగా ఏఐఏడీఎంకేను ఏర్పాటు చేసి ఎన్నికల్లో విజయదుందుభి మోగించి తమిళనాడు ముఖ్యమంత్రిగా పదేళ్లపాటు (1977-1987) పనిచేశారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను చేరదీసి ఆమెలో ప్రతిభను గుర్తించింది కూడా ఆయనే.

ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా జయ అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా - రాజ్యసభ సభ్యురాలిగా ఉండేవారు. ఆమెకు ఇంగ్లిష్ లో అసాధారణ సామర్థ్యం ఉండటంతో రాజ్యసభకు పంపారు ఎంజీఆర్. ఆ తర్వాత ఆయన గుండెపోటుతో మరణించడంతో ఆయన సతీమణి - ప్రముఖ నటి జానకి పార్టీ బాధ్యతలు - ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినా అతి తక్కువ కాలం మాత్రమే వాటిల్లో ఉండగలిగారు. ఇక అప్పటి నుంచి జయలలిత గుప్పిట్లోకి పార్టీ వెళ్లిపోయింది. ఇప్పుడిదంతా ఎందుకంటారా? తెలుసుకోవాల్సిన అవసరం ఉందండీ..

ఎంజీఆర్ జయంతి (జనవరి 17) సందర్భంగా త్వరలో కొత్త వంద రూపాయిల కాయిన్లను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ కాయిన్‌ వ్యాసం 44 మిల్లీమీటర్లు ఉంటుందని తెలిపింది. రూ. 100 కాయిన్‌పై నాలుగు సింహాల అశోకుని స్థూపం కూడా ఉంటుందని వివరించింది. కాయిన్ వెనుక భాగంలో ఎంజీ రామచంద్రన్‌ బొమ్మ ఉంటుందంట. కాయిన్‌ బరువు 35 గ్రాములు ఉంటుందని, దీన్ని తయారు చేయడానికి వెండి - రాగి - నికెల్‌ - జింక్‌ ల మిశ్రమాన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.