Begin typing your search above and press return to search.

నల్లధనానికి లాస్ట్ ఛాన్స్.. వీరికి వర్తించదు!

By:  Tupaki Desk   |   20 Dec 2016 4:22 AM GMT
నల్లధనానికి లాస్ట్ ఛాన్స్.. వీరికి వర్తించదు!
X
విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని స్వదేశానికి రప్పించడం సంగతి, ఈ మేరకు ఎన్నికల సమయంలో మోడీ చేసిన వాగ్ధానాల సంగతి కాసేపు పక్కనపెడితే.. దేశంలోని నల్లధనంపై మోడీ యుద్ధం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో నోట్లరద్దు అనంతరం మరోసారి నల్లబాబులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం "ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై)". అయితే ఏ రకంగా చూసుకున్నా ఈ పథకమే చివరి అవకాశమని చెబుతున్నారు ఆదాయ పన్ను శాఖ అధికారులు. నల్లధనం ఉన్నవారు ఈ నెల 30లోగా వెల్లడించాలని, అలాకాని పక్షంలో ఆ తర్వాత కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అయితే అసలు ఆ పథకం వివరాలేమిటి.. ఆ పథకం ప్రకారం బ్యాంకులో నల్లధనాన్ని డిపాజిట్ చేస్తే సదరు నల్లబాబుకు దక్కేదెంత, బ్యాంకులు తీసుకునేదెంత, ప్రభుత్వానికి చెళ్లించే ఫైన్ ఎంత.. వంటీ వివరాలపై ఐటీ అధికారులు మరింత క్లారిటీ ఇచ్చారు.

ఈ పథకం కింద నల్లధనాన్ని బ్యాంకులు - తపాలా కార్యాలయాల్లో జమ చేసేందుకు ఈనెల 30 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. నల్లధనాన్ని ప్రకటించాలనుకునేవారు ముందుగా లెక్క చూపని డబ్బునుంచి 50 శాతాన్ని పన్ను - సర్‌ చార్జీ - ఫైన్ కింద ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే... 50శాతం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక మిగిలిన 50శాతంలో 25 శాతాన్ని నాలుగేళ్ల నిర్బంధ కాల వ్యవధి గల పీఎంజీకేవై బాండ్ల రూపంలో బ్యాంకుల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఈ సొమ్మును 4 ఏళ్ల తర్వాత మాత్రమే తిరిగి తీసుకోవడానికి వీలుంటుంది. అలాగే ఈ నాలుగేళ్లకు ఈ 25శాతం సొమ్ముకు ఎలాంటి వడ్డీ చెల్లించబడదు. ఇక మిగిలిన 25శాతాన్ని సదరు దరఖాస్తుదారులు ఎప్పుడైనా వాడుకోవచ్చు. అయితే ఈ పథకం నగదు రూపంలో ఉన్న నల్లధనానికే వర్తిస్తుంది తప్ప స్థిరాస్తులు - చరాస్తులు - బంగారంగా ఉన్న ఆస్తులకు వర్తించదు. విదేశాల్లోని ఆదాయం - ఆస్తుల ప్రకటనకు కూడా ఈ పథకం వర్తించదు.

అదేవిదంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా నల్లధనాన్ని సంపాదించిన వ్యక్తులకు ఈ పీఎంజీకేవై వర్తించదు. స్మగ్లింగ్ - మత్తు పదార్థాలు - మాదక ద్రవ్యాలు - చట్ట వ్యతిరేక కార్యకలాపాలు - మనీలాండరింగ్ - బినామీ లావాదేవీలు - 1992 సెక్యురిటీ స్కాం - ఐపీసీలోని 9వ అధ్యాయం ప్రకారం శిక్షార్హమైన నేరాలు - ఐపీసీ అధ్యాయం 17 ప్రకారం శిక్షార్హమైన నేరాలైన దొంగతనం - దోపిడీ లు - బెదిరించి వసూళ్లు - హత్యల ద్వారా సంపాదించిన ఆస్తులను ఈ పథకం కింద ప్రకటించడానికి వీలులేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/