Begin typing your search above and press return to search.

వైన్స్‌ దుకాణాలపై దాడులు..మద్యం చోరీ

By:  Tupaki Desk   |   6 April 2020 8:50 AM GMT
వైన్స్‌ దుకాణాలపై దాడులు..మద్యం చోరీ
X
కరోనా వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌ డౌన్‌ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పేదలు - కూలీలు ఉపాధి కోల్పోయి పస్తులుండాల్సి వస్తోంది. వారందరూ ఆ విధంగా అవస్థలు ఎదుర్కొంటుండగా మందుబాబుల పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో మందుబాబుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మద్యం దుకాణాలన్నీ మూసివేయడంతో మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రెండు వారాలుగా మందు దుకాణాలు మూసివేయడంతో వారు పిచ్చెక్కిపోతున్నారు. దీంతో తెలుగు ప్రజలు అవస్థలు పడుతున్నారు.

అయితే మందుబాబులు మాత్రం మద్యం కోసం ఎంత చెల్లించేందుకైనా సిద్ధపడుతున్నారు. దొంగచాటుగా మద్యం తీసుకునేందుకు సాహసాలు చేస్తున్నారు. ఒత్తిడిని తట్టుకోలేక వాళ్లు ఇక మందు దుకాణాలపై దాడి చేస్తున్నారు. మద్యం దొరక్క వైన్స్‌ పై దాడులు చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్‌ తోపాటు విజయవాడలోనూ చోటుచేసుకున్నాయి.

హైదరాబాద్‌ లోని గాంధీనగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ఓ వైన్స్ షాపు‌లో దొంగతనం జరిగింది. వైన్స్‌ దుకాణం పై భాగంలో ఉండే రేకును కత్తిరించి దుకాణంలోకి దొంగ దూరాడు. ఈ సందర్భంగా రూ.3 లక్షల విలువైన మద్యం సీసాలను దొంగిలించాడు. ఈ క్రమంలో గల్లా పెట్టెలో ఉన్న డబ్బును కూడా ఎత్తుకెళ్లాడు. అయితే ఈ దుకాణంలో ఉన్న సీసీ టీవీలో ఈ దొంగతనం రికార్డ్ అయ్యింది.

ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడకు సమీపంలోని వణుకూరులో కూడా మందు దుకాణంలో దొంగతనానికి కొందరు పాల్పడ్డారు. ప్రభుత్వ మద్యం దుకాణంలోకి దూరి మద్యం సీసాలు దొంగిలించారు. ఆదివారం అర్ధరాత్రి దుకాణం కిటికీ పగలగొట్టి లోపలికి చొరబడి రూ.1.60లక్షల విలువైన మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు.

ఇదే పరిస్థితి కర్ణాటకలోనూ ఉంది. మంగళూరు సమీపంలోని ఉల్లాల్ పట్టణంలో మద్యం దుకాణం‌లో మందుబాబులు ప్రవేశించి మద్యం సీసాలు దొంగగిలించారు. లక్షలు విలువ చేసే మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఈ విధంగా ప్రతిచోట మందుబాబులు హల్‌ చల్‌ చేస్తున్నారు. మందు కోసం దొంగతనాలకు పాల్పడుతూ తమ దాహం తీర్చుకుంటున్నారు. అయితే ఈ ఘటనలతో మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మద్యం దుకాణాలకు భద్రత కల్పించాలని పోలీసులను కోరుతున్నారు.