Begin typing your search above and press return to search.

ప్రత్యర్థికి టన్నుల కొద్దీ సానుభూతి వచ్చేలా మోడీ నిర్ణయం

By:  Tupaki Desk   |   8 Nov 2019 12:31 PM GMT
ప్రత్యర్థికి టన్నుల కొద్దీ సానుభూతి వచ్చేలా మోడీ నిర్ణయం
X
మిగిలిన రంగాల సంగతిని పక్కన పెడితే.. రాజకీయంలో చేయకూడని తప్పు చేస్తే అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. దిద్దుకోలేని తప్పుల్ని అస్సలు చేయకూడదు. ఇలాంటి విషయాలు మోడీషాలకు అస్సలు చెప్పాల్సిన అవసరం లేదంటారు చాలామంది. కానీ.. అధికారం తలకు బాగా ఎక్కేస్తే ఎలా వ్యవహరిస్తారన్న దానికి తగ్గట్లే.. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ఉందంటున్నారు. రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి.. కాలం కర్మం కలిసి రాక విపక్షంలో ఉన్న కాంగ్రెస్ అధినేత్రి.. ఆమె కుటుంబానికి స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను ఉపసంహరించుకుంటూ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం షాకింగ్ గా మారింది.

ఇప్పుడున్న ఎస్ పీజీ రక్షణ స్థానే.. జడ్ ప్లస్ కేటగిరి భద్రతను కల్పించనున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో పాటు.. ఆమె కుమారుడు రాహుల్.. కుమార్తె ప్రియాంక వాద్రాతో పాటు.. వారి కుటుంబానికి ఇస్తున్న అత్యున్నత భద్రత ఇకపై కొనసాగదు.

దేశంలోని రాజకీయ నేతలకు కల్పిస్తున్న భద్రతపై జరిపిన ఒక సమీక్షలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే గాంధీ కుటుంబానికి చెందిన ఇందిరమ్మను సొంత భద్రతాధికారులు కాల్చి చంపితే.. రాహుల్ గాంధీని ఎల్టీటీఈ తీవ్రవాదులు మానవబాంబుతో హతమార్చటం తెలిసిందే. వివిధ ఉగ్రవాద సంస్థల హిట్ లిస్ట్ లో ఉన్న వారికిచ్చే భద్రతను తగ్గించటం ద్వారా దేశ వ్యాప్తంగా దుమారం రేగే అవకాశం ఉంది.

మరి.. ఆ విషయాన్ని మోడీ సర్కారు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. రాజీవ్ హత్యోదంతం తర్వాత నుంచి ఇప్పటివరకూ గాంధీ కుటుంబానికి ఎస్పీజీ రక్షణను కొనసాగిస్తున్నారు. అందుకు బిన్నంగా మోడీ సర్కారు తాజాగా భద్రత తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఆగస్టులోనే మాజీ ప్రధాని మన్మోహన్ కు ఎస్పీజీ భద్రతను తొలగిస్తూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

రాజకీయ ప్రత్యర్థికి ఉన్న భద్రతను తగ్గిస్తూ అధికారపక్షం తీసుకునే నిర్ణయం ప్రజల్లో సానుభూతి పెంచటంతో పాటు.. మోడీ మీద ఉన్న వ్యతిరేకతను పెంచే వీలుందంటున్నారు. ఇదిలా ఉంటే.. రానున్న రోజుల్లో రాష్ట్రపతి.. ప్రధానమంత్రులకు మాత్రమే ఎస్పీజీ భద్రత అని.. మిగిలిన ప్రముఖులకు లేకుండా చేసేలా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టే అవకాశం ఉందంటున్నారు. చేజేతులారా..ప్రత్యర్థి చేతికి చక్కటి అస్త్రం ఇస్తూ మోడీషాలు నిర్ణయించటం ఏమిటన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.