Begin typing your search above and press return to search.

అదృష్టం త‌లుపు త‌డితే...ముఖం మీదే త‌లుపేశారు

By:  Tupaki Desk   |   9 Jun 2019 9:23 AM GMT
అదృష్టం త‌లుపు త‌డితే...ముఖం మీదే త‌లుపేశారు
X
గౌరు వెంక‌ట‌రెడ్డి - చ‌రిత దంప‌తులు... దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అత్యంత ఆత్మీయులు. ప్ర‌త్య‌ర్థుల ఎదురుదెబ్బ‌ల‌తో చిత్తు అయిపోయిన గౌరు ఫ్యామిలీకి ఆప‌న్న హ‌స్తం ఇచ్చేసిన వైఎస్‌.. చ‌రితారెడ్డిని ఎమ్మెల్యేగా చేయ‌డంతో పాటుగా జైల్లో ఉన్న వెంక‌ట‌రెడ్డిని బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. అయితే వైఎస్ అకాల మ‌ర‌ణంతో ఆయ‌న త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా ఆ ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంత‌కంటే కూడా అధికంగానే ఇచ్చేసి తండ్రి బాట‌ను కొన‌సాగించారు. అయితే క‌ష్ట‌కాల‌మంతా జ‌గ‌న్ వెన్నంటే ఉన్న గౌరు దంపతులు స‌రిగ్గా అదృష్టం వారి త‌లుపు త‌డుతున్న కీల‌క స‌మ‌యంలో వారికి వారే అదృష్టాన్ని కాలితో త‌న్నేశారు. నిజ‌మా? అంటే.. ఇప్ప‌టిదాకా జ‌రిగిన ప‌రిణామాల‌ను చూస్తుంటే... ఈ మాట నిజ‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

వైఎస్ బ‌తికుండ‌గానే రాజ‌కీయంగా బాగా నిల‌దొక్కుకున్న గౌరు వెంక‌ట‌రెడ్డి ఫ్యామిలీ... జ‌గ‌న్ వైసీపీని స్థాపించిన త‌ర్వాత మ‌రింత‌గా నిల‌దొక్కుకుంది. క‌ర్నూలు జిల్లాలో ఓ బ‌ల‌మైన కుటుంబంగా మారింది. అయితే ఎన్నిక‌ల దాకా వైసీపీలోనే ఉండి... స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డిన నేప‌థ్యంలో గౌరు ఫ్యామిలీ వేసిన ఓ రాంగ్ స్టెప్ ఇప్పుడు వారిని ఎందుకూ కొర‌గాకుండా చేసింద‌ని చెప్పాలి. ఎన్నికలు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో గౌరు చరితారెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పాణ్యం నియోజ‌క‌వ‌ర్గంలో మంచి బ‌ల‌మైన నేత‌గా ఉన్న కాట‌సాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలోకి చేరడంతో గౌరు ఫ్యామిలీలో భ‌యం మొద‌లైంది. త‌మకు టికెట్ వ‌స్తుందా? రాదా? అన్న సందేహాల్లో గౌరు ఫ్యామిలీ ఉండ‌గా... టికెట్ ద‌క్క‌కుంటే పార్టీ మారేందుకు కూడా వెనుకాడ‌కూడ‌ద‌ని వారు నిర్ణ‌యించుకున్నారు.

అయితే తాము అండ‌గా నిల‌బ‌డ్డ ఫ్యామిలీ... ప్రాథ‌మిక అంశాల‌ను మ‌రిచి పార్టీని వీడేందుకు య‌త్నిస్తారా? అన్న కోణంలో ఆలోచించిన జ‌గ‌న్‌... మీ ఇష్టం అంటూ ముఖం మీదే చెప్పేశారు. అదే స‌మ‌యంలో గౌరు బావ గారైన మాండ్ర శివానంద‌రెడ్డి అప్ప‌టిదాకా త‌నకు అవ‌కాశాలు ద‌క్క‌లేద‌ని, ఈ సారి ద‌క్క‌కుంటే ఇక త‌న ప‌రిస్థితి అంతేన‌ని భావించారు. త‌న కోసం ఏదైనా చేయాలనీ ఆయ‌న గౌరుపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్ర‌మంలో బావ కోసం ఏం చేయడానికైనా సిద్ధ‌మేన‌న్న రీతిలో వ్య‌వ‌హరించిన గౌరు... మాండ్ర‌కు నంద్యాల ఎంపీ టికెట్ ఇస్తే... తాము టీడీపీలోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మేన‌ని తేల్చేశారు. నంద్యాల‌లో మంచి అభ్య‌ర్థి లేర‌ని భావించిన టీడీపీ మాండ్ర‌కు అవ‌కాశం ఇచ్చేందుకు సై అనడంతోనే గౌరు పార్టీ మారిపోయారు.

అయితే ఎన్నిక‌ల్లో అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ వైసీపీ బంప‌ర్ విక్ట‌రీ సాధించ‌గా జ‌గ‌న్ సీఎం అయిపోయారు. త‌నను న‌మ్ముకున్న వాళ్లంద‌రికీ మంచి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. ఈ నేప‌థ్యంలో గౌరు ఫ్యామిలీ అదృష్టాన్ని కాల‌ద‌న్నుకున్న వైనంపై ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు సాగుతున్ఆన‌యి. పాణ్యం సీటు వ‌దులుకుని వైసీపీలోనే ఉండి ఉంటే... మోపిదేవి - పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌ ల మాదిరిగా గౌరు కుటుంబానికి కూడా జ‌గ‌న్ కేబినెట్ లో మంచి స్థాన‌మే ద‌క్కేద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి జ‌రిగిన న‌ష్టాన్ని, అదృష్టాన్ని త‌మ‌కు తాముగా త‌న్నేసుకున్న వైనాన్ని గౌరు ఫ్యామిలీ ఎలా స‌రిదిద్దుకుంటుందో చూడాలి.