Begin typing your search above and press return to search.

‘నా చావుకు నా ఉద్యోగమే కారణం’.. సంచలనంగా గ్రామ పంచాయితీ కార్యదర్శి సూసైడ్

By:  Tupaki Desk   |   18 March 2021 6:30 AM GMT
‘నా చావుకు నా ఉద్యోగమే కారణం’.. సంచలనంగా గ్రామ పంచాయితీ కార్యదర్శి సూసైడ్
X
ఒక చిరుద్యోగి ఆత్మహత్య ఇప్పుడు సంచలనంగా మారింది. వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపటమే కాదు.. ప్రభుత్వం పట్టించుకోని అంశాలు చాలానే ఉన్నాయన్న విషయాన్ని అందరికి తెలిసేలా చేయటం కోసం.. ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తీవ్రంగా కలిచివేసేలా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించిన వివరాలు సీఎం కేసీఆర్ కు తెలిస్తే.. తీవ్ర ఆగ్రహానికి గురి కావటం ఖాయమంటున్నారు. ఇంతకూ జరిగిందేమంటే..

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేటకు చెందిన జగన్నాథ్.. మిన్పూర్ గ్రామ పంచాయితీ జూనియర్ కార్యదర్శిగా పని చేస్తున్నారు. విధి నిర్వహణలో ఒత్తిళ్లు.. ఎదురవుతున్న అవమానాల్ని భరించలేని అతడు ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న వైనం అయ్యో అనకుండా ఉండలేని పరిస్థితి.

తన చావుకు కారణం తన ఉద్యోగమే అన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొనటమే కాదు.. గ్రామ ఇన్ ఛార్జి సర్పంచ్.. ఏదో వార్డు సభ్యుడి వేధింపులే కారణమని పేర్కొన్నారు. తాను పని చేస్తున్న గ్రామానికి చెందిన నాయకులు పలువురికి మద్యం తాగించి తనతో గొడవకు దిగేలా ఉసిగొల్పుతున్నారన్నారు. వారి చిల్లర రాజకీయాలు తాను భరించలేకపోతున్నట్లు చెప్పారు. అందుకే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ లేఖ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

తోటి ఉద్యోగులు.. అధికారులు నచ్చజెప్పారని.. ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే తల్లిదండ్రులకు బాధ కలుగుతుందన్న ఉద్దేశంతో మళ్లీ జాబ్ లో చేరినట్లు పేర్కొన్నారు. ఏపీవో తనను కుక్కలా తిప్పుకున్నారే కానీ.. ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 27 వరకు చేయించిన పనులకు చెల్లింపులు ఇవ్వలేదన్నారు.

నర్సరీ పనులు.. బ్యాగ్ ఫిల్లింగ్.. పోల్స్ ఫిట్టింగ్.. నర్సరీ లేబర్ కు.. ఆడిటింగ్ కు తన డబ్బులే ఖర్చు పెట్టానన్నారు. తనతో అయినా తాను ఎదుర్కొన్న సమస్యల్ని పరిష్కరించాలని.. తనకు బతకాలని ఉన్నా.. ఇలాంటి వేధింపులతో తన వల్ల కావటం లేదంటూ తనువు చాలించాడు. అతడి ఆత్మహత్య లేఖ వ్యవస్థలోని లోపాన్ని ఎత్తి చూపటమే కాదు.. మరీ ఎంత ఆరాచకపు పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని తెలిసేలా చేస్తున్నాయని చెప్పాలి.