Begin typing your search above and press return to search.

వలంటీర్ల మామూళ్లు.. నలుగురిపై వేటు

By:  Tupaki Desk   |   4 Oct 2019 6:04 AM
వలంటీర్ల మామూళ్లు.. నలుగురిపై వేటు
X
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ తలపోశారు. గ్రామసచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతీ 50 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీర్ ను నియమించారు. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు బాధ్యతలు అప్పగించారు. ఎంతో సదాశయంతో చేసిన ఈ గొప్ప పనిపై ఎన్ని విమర్శలు వచ్చినా మొక్కవోని పట్టుదలతో నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి ప్రజలకు పాలనను చేరువ చేశారు. అయితే ఇప్పుడు కొందరు అక్రమార్కులైన వలంటీర్ల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది.

ఉద్యోగాల్లో చేరి నెల గడువక ముందే అప్పుడే వలంటీర్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వలంటీర్లు తప్పు చేస్తే ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని స్వయంగా సీఎం జగన్ పిలుపునిచ్చి ఒక టోల్ ఫ్రీ నంబర్ ను కేటాయించారు.

వలంటీర్ల అక్రమాలపై ఫిర్యాదులు మొదలయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను వినియోగించుకొని ప్రజలకు సేవ చేయకుండా కొందరు కాసులకు కక్కుర్తి పడిన వలంటీర్లు మామూళ్లు వసూలు చేశారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. విచారణ జరిపిన సర్కారు తాజాగా నలుగురు ప్రభుత్వ వలంటీర్లను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామ వలంటీర్లుగా పనిచేస్తున్న చుక్క విజయవర్మ, లంకపల్లి ఒలివ, గాడెల్లి సునీల్ కుమార్ - తెనాలి వనజలు పెన్షన్ దారుల నుంచి దసరా మామూళ్లు వసూలు చేశారని ఫిర్యాదులు వచ్చాయి. వారిపై వచ్చిన ఫిర్యాదులు నిజమేనని విచారణలో తేలడంతో వెంటనే వారిని తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

జగన్ అవినీతి రహిత పాలన అందించాలనే సంకల్పానికి కొందరు వలంటీర్లు మచ్చ తెస్తున్నారు. ఇప్పుడు ఈ నలుగురిని తొలగించడంతో మిగతా వారు అలెర్ట్ అవుతున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను గాడినపెట్టేందుకు జగన్ సర్కారు కఠినంగా ముందుకెళుతోంది.