Begin typing your search above and press return to search.

2019లో మహా కూటమి?

By:  Tupaki Desk   |   16 March 2018 4:24 AM GMT
2019లో మహా కూటమి?
X
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన సమాజ్‌ వాది పార్టీ ఏడాది తిరగకుండానే లోక్‌ సభ ఉప ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేయడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని ఓడించేందుకు మహాకూటమి ఏర్పడవచ్చన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఇందుకు అనుగుణంగానే యూపీ - బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బుధవారం రాత్రి నుంచి వివిధ పార్టీల నేతల మధ్య సంప్రదింపులు - చర్చలు ప్రారంభమయ్యాయి. ఆయా పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సైతం ఇందుకు ఊతమిచ్చే విధంగా ఉన్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు మహా కూటమి ఏర్పాటుకు ప్రతిపక్ష పార్టీల్లో నైతిక స్థైర్యాన్ని కల్పించాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ఎంపీ మజీద్ మెమన్ పేర్కొన్నారు. మహాకూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ - ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్ ఇప్పటికే చర్చలు ప్రారంభించారని ఆయన వెల్లడించారు.

యూపీ - బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శరద్‌ పవార్‌ తో మాట్లాడారు. ఈ నెల 28న రాహుల్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో ఢిల్లీలో భేటీ కానున్నారు. మహాకూటమి వాస్తవ రూపం దాల్చుతున్నది అని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నాయకుడు - జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. బీఎస్పీ మద్దతుతో ఎస్పీ అభ్యర్థులు విజయాలు సాధించడాన్ని ఆయన గుర్తుచేస్తూ మహాకూటమి వల్ల ఎటువంటి ఫలితాలు వెలువడుతాయో యూపీలో స్పష్టమైందని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ ఇటీవల ఢిల్లీలో ఇచ్చిన విందుకు ఎన్సీ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా హాజరయ్యారు. 2019 లోక్‌ సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పాటు కోసమే ఆ విందు నిర్వహించినట్టు తెలుస్తున్నది. యూపీ - బీహార్ ఫలితాలు భావసారూప్యత ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యమయ్యేలా ప్రభావం చూపుతాయని సీపీఐ నాయకుడు డీ రాజా అన్నారు. అయితే మహాకూటమిపై సాగుతున్న చర్చల గురించి సమాజ్‌ వాదీ నాయకుడు రామ్‌ గోపాల్ యాదవ్ మాత్రం వేచి చూడండి అని అన్నారు. ఈ ఫలితాలపై తమ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారని - వారు సంతృప్తి పడితే మరిన్ని ఓట్లు పడుతాయని చెప్పారు.

బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతిని పురస్కరించుకొని రాహుల్‌ గాంధీ గురువారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కాన్షీరాం గొప్ప సామాజిక సంస్కర్త అని వ్యాఖ్యానించారు. కేంద్రంలో మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతుండటం - యూపీలో బీఎస్పీ మద్దతుతో ఎస్పీ విజయం సాధించిన నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాహుల్ వ్యాఖ్యలను బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఆయన స్నేహ హస్తం అందించేవిగా ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ మద్దతుతో రెండు లోక్‌ సభ స్థానాలను గెలుచుకున్న సమాజ్‌ వాదీ పార్టీ ఇక ముందు కూడా ఆ పొత్తును కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతాన్ని మరచిపోవాలని - బీఎస్పీతో తమ సంబంధాలు సానుకూలంగా ఉన్నాయని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నది. బద్దవిరోధులుగా ఉన్న ఎస్పీ - బీఎస్పీ పార్టీలు బీజేపీని ఓడించేందుకు ఈ ఎన్నికల్లో చేతులు కలిపాయి.

గోరఖ్‌ పూర్ సీటును యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ - ఫూల్పూర్ నియోజకవర్గాన్ని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఖాళీ చేయడంతో ఆ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడిన వెంటనే రెండు పార్టీల కార్యకర్తలు మాయావతి - అఖిలేశ్‌ ను ఉద్దేశించి బువా భతీజా (మేనత్త - మేనల్లుడు) జిందాబాద్ అని నినాదాలు చేయడం రానున్న రోజుల్లో ఎస్పీ - బీఎస్పీల స్నేహం మరింత బలపడనుందనడానికి సంకేతంగా పరిశీలకులు భావిస్తున్నారు. బీఎస్పీ మద్దతుతోనే ఈ విజయం సాధ్యమైందని గ్రహించిన అఖిలేశ్ యాదవ్ ఫలితాలు వెలువడిన వెంటనే బుధవారం సాయంత్రం స్వయంగా మాయావతి ఇంటికి వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. ఇక కాంగ్రెస్‌ తో తమ సంబంధాలు ఎప్పుడూ సానుకూలంగానే ఉన్నాయని అఖిలేశ్ పేర్కొన్నారు. రాహుల్ - తాను యువకులమని - దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు తామిద్దరం కలిసి పరిష్కారాలు వెతుకాల్సి ఉంటుందని చెప్పారు. మరోవైపు రాహుల్‌ గాంధీ బుధవారం రాత్రి ఎన్సీపీ నాయకుడు శరద్‌ పవార్‌ ను ఆయన ఇంటికి వెళ్లి కలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా గట్టిపోటీనివ్వాలని ఇద్దరు నేతలు చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28న శరద్‌పవార్ నిర్వహించనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతారని భావిస్తున్నారు.