Begin typing your search above and press return to search.

బీహార్: బీజేపీ తప్పేంటి? నితీష్ గొప్పేంటి?

By:  Tupaki Desk   |   8 Nov 2015 7:37 AM GMT
బీహార్: బీజేపీ తప్పేంటి? నితీష్ గొప్పేంటి?
X
దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బీహార్ ఎన్నికల ఫలితాలు దాదాపు తెలిసిపోయాయి. బీహార్ పీఠం ఎవరిదో తేల్చేశాయి. తన చాణుక్యం.. మంత్రాగంతో బీహార్ కోటపై కాషాయం జెండా ఎగురవేయాలని తపించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆశల్ని బీహారీలు అడియాశలు చేశారు. అభివృద్ధిని తమకు పరిచయం చేసిన నితీశ్ కుమార్ మీదనే వారు నమ్మకాన్ని ఉంచారు. తమకు అధికారం కట్టబెడితే బీహార్ లో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తామని చెప్పిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మాటను బీహారీలు లక్ష్య పెట్టలేదు.

దేశంలో తమ హవా నడుస్తుందని భావించిన కమలనాథులతో పాటు.. మోడీకి సైతం బీహారీలు తమదైన శైలిలో షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఐదు దశల్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు తమ తీర్పును స్పష్టంగా వెల్లడించారు. జేడీయూ నేతృత్వంలోని లౌకిక మహాకూటమికి 178 స్థానాల్లో గెలిస్తే .. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మాత్రం 58 స్థానాలకు పరిమితం కావటం గమనార్హం.

నిజానికి పోలింగ్ ముగిసిన వెంటనే.. వివిధ మీడియా సంస్థలు ఎన్నికల ఫలితాలకు సంబంధించి తమ అంచనాలు ప్రకటించాయి. దాదాపు తొమ్మిది ప్రముఖ మీడియా సంస్థలు తమ ఎగ్జిట్ సర్వేను వెల్లడించగా.. ఆరు సంస్థలు లౌకిక కూటమి విజయం తథ్యమని తేల్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు షాక్ తప్పదని స్పష్టం చేశారు. కాకుంటే.. ఇరు వర్గాల మధ్య సీట్ల అంతరం చాలా తక్కువగా ఉంటుందని.. హోరాహోరీగా పోటీ ఉంటుందని చెప్పారు. కానీ.. అందుకు భిన్నంగా తుది ఫలితాలు ఉండటం విశేషం.

బీహారీలు చాలా స్పష్టంగా నితీశ్ మీద తమకున్న నమ్మకాన్ని మరోసారి వ్యక్తం చేశారు. అదే సమయంలో.. జేడీయూ.. ఆర్జేడీ.. కాంగ్రెస్ తదితర పార్టీలు తమకు ఎక్కడ బలం ఉన్నాయో అక్కడే పోటీ చేశాయి. ఈ ముఖ్య పార్టీలన్నీ కలిసి కూటమిగా మారటంతో ఓటు బ్యాంక్ మరింత బలపడింది. ఎక్కడా చీలికకు అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. బీహార్ లో దశాబ్ది కాలం (కొంతకాలం ఆయన సీఎం పదవికి దూరంగా ఉన్నారు. అది మినహాయిస్తే..) ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నితీశ్ మీద బీహారీల్లో వ్యతిరేకత లేదు.

వాస్తవానికి దీర్ఘకాలంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే.. ఆయన పాలన మీద.. సదరు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద వ్యతిరేకత ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా నితీశ్ మీద బీహారీల్లో వ్యతిరేకత లేకపోవటం కాస్త విస్మయం కలిగించే విషయమే. ఇక.. మోడీ బ్యాచ్ ఓ పెద్ద తప్పు చేసిందన్న మాట వినిపిస్తోంది. హిందుత్వ ఓటుబ్యాంక్ ను సమీకరించాలని భావించింది. నిజానికి ఇలాంటి ప్రయోగం అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే.. మైనార్టీలను ఓటు బ్యాంకుగా మార్చినా అదో తప్పుగా పరిగణించని వారు.. హిందుత్వ ఓటు బ్యాంకు నినాదాన్ని మాత్రం బూచిగా చూపించే సంస్కృతి మన దేశంలో ఉంది. ఈ విషయాన్ని గుర్తించటంలో మోడీ అండ్ కో తప్పటడుగు వేయటం నితీశ్ వర్గానికి లాభంగా మారిందని చెప్పొచ్చు.

అత్యుత్సాహంగా ఉండటంతో పాటు.. హిందుత్వ ఓటుబ్యాంక్ తో అద్భుతాలు సృష్టించొచ్చు అన్న దూకుడులో సంప్రదాయ లౌకికవాదుల విషయాన్ని మోడీ వర్గం చేజార్చుకుంది. హిందువులుగా ఉండి కూడా.. హిందుత్వ ఓటు బ్యాంకుగా తమను తాము భావించుకోవటానికి సిద్ధంగా లేని వారు చాలామందే ఉంటారు. అలాంటి వారిని ఎన్డీయే కూటమి దూరం చేసుకుంది. దీనికి తోడు.. దేశంలో మత అసహనం అంశం కూడా ఎన్డీయే అవకాశాల్ని దెబ్బ తీసిందని చెప్పొచ్చు.

సాధారణంగా ఒక రాష్ట్ర ఎన్నికలు ఆ రాష్ట్రంలోని భావోద్వేగాలకు అనుగుణంగా సాగుతుంటాయి. బీహార్ ఎన్నికలు మాత్రం జాతీయ అంశాల ఆధారంగా జరగటం విశేషం. ఇక.. అభివృద్ధి నమూనాతో బీహార్ ఎన్నికల్లో ముందుకు వెళ్లాల్సిన ఏన్డీయే పక్షం అందుకు భిన్నంగా హిందుత్వ ఓటుబ్యాంకును సమీకరించటంపై దృష్టి పెట్టుకోవటం మోడీ బ్యాచ్ కు భారీ పరాజయ దిశగా పయనించేలా చేశాయి. తమకు తిరుగులేదన్నట్లుగా మోడీ పరివారం భావించటం.. వారి ఆత్మవిశ్వాసం కాస్తా అహంకారంగా కనిపించటం కూడా కాషాయ పరాజయానికి కారణంగా చెప్పొచ్చు. భారతీయ ఓటరు దేనినైనా సరే అంటాడు కానీ అహంకారాన్ని.. అతి విశ్వాసాన్ని తట్టుకోలేడు. ఆ విషయం బీహార్ ఎన్నికలు మరోసారి నిరూపించాయి.