Begin typing your search above and press return to search.

విశాఖలో జగన్... వెల్ కమ్ అదిరింది

By:  Tupaki Desk   |   28 Dec 2019 5:49 PM GMT
విశాఖలో జగన్... వెల్ కమ్ అదిరింది
X
సాగర నగరం విశాఖపట్నంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన అందరి దృష్టిని ఆకర్షించింది. పది రోజుల క్రితం ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున... ఏపీకి ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖ ఉంటుందేమోనంటూ జగన్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. ఇప్పటికే టీడీపీ హయాంలో ప్రకటించిన అమరావతిని కేవలం లెజిస్లేచర్ కేపిటల్ కు పరిమితం చేసి... అన్ని రకాలుగా ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా, రాయలసీమలోని కర్నూలును జ్యుడిషియల్ కేపిటల్ గా ఏర్పాటు కావొచ్చేమోనంటూ జగన్ ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో భవిష్యత్తులో ఏపీ రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలిపోతోందన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాజధానిపై తనదైన శైలి సంచలన ప్రకటన చేసిన తర్వాత తొలిసారిగా విశాఖ పర్యటనకు వచ్చిన జగన్... తన పర్యటన ఆసాంతం ఆసక్తి రేకెత్తించేలా వ్యవహరించారని చెప్పాలి

తాము అడగకున్నా విశాఖకు రాజధానిని కేటాయించేలా సాగుతున్న జగన్ కు విశాఖ వాసులు అదిరేటి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి కైలాసగిరి మీదుగా ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవ్ వేదిక దాకా ఏకంగా 24 కిలో మీటర్ల మేర మానవహారంగా ఏర్పడిన విశాఖ వాసులు జగన్ కు ఘన స్వాగతం పలికారు. ఈ తరహా స్సెషల్ వెల్ కమ్ కు జగన్ ఫిదా అయిపోయారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆ తర్వాత విశాఖ ఉత్సవ్ ను ప్రారంభించిన జగన్... అక్కడ ప్రదర్శించిన షార్ట్ ఫిల్మ్ ను ఆసక్తిగా తిలకించారు. ఈ షార్ట్ ఫిల్మ్ లో విశాఖపై జగన్ కు ఉన్న అభిప్రాయాలను చిత్రీకరించారు. విశాఖ ఉక్కుపై జగన్ కు ప్రత్యేక ప్రేమ ఉన్నట్లుగా కూడా చూపారు. జగన్ తో పాటు వైసీపీకి చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. జగన్ పర్యటనలో గ్రాండ్ వెల్ కమ్, షార్ట్ ఫిల్మ్ లే ప్రధాన ఆకర్షణగా నిలిచాయని చెప్పాలి.

ఇదిలా ఉంటే... విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటూ ప్రకటన చేసిన జగన్... ఈ పర్యటనలో నగరంలోని కైలాసగిరి, సెంట్రల్ పార్క్ వద్ద రూ.1,285.32 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెడతారన్న వార్తల నేపథ్యంలో రాజధాని అవసరాలకు తగిన ఏర్పాట్ల కోసమే ఈ పనులను చేస్తున్నట్లుగా సమాచారం. ఒకేసారి రూ.1285 కోట్ల మేర విలువ చేసే పనులకు ఒకేసారి జగన్ శంకుస్థాపన చేయడం నిజంగానే ఆసక్తి రేకెత్తించేదే. భవిష్యత్తులో విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటు చేస్తే... అప్పటికప్పుడు రాజధానికి అవసరమైన ఏర్పాట్ల కల్పన సాధ్యం కాదన్న భావనతోనే... ఆ ప్రకటనకు ముందుగానే విశాఖలో రాజధాని తరహా ఏర్పాట్ల కోసమే ఈ పనులు చేపడుతున్నట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటూ ప్రకటించడంతో పాటుగా ఏకంగా రూ.1285 కోట్ల మేర అభివృద్ధి పనులకు జగన్ శ్రీకారం చుట్టడంతో నిజంగానే విశాఖ వాసులు జగన్ కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారన్న వాదన వినిపిస్తోంది.