Begin typing your search above and press return to search.

భీమవరంలో పవన్ ఓటమి ఖాయం..

By:  Tupaki Desk   |   23 March 2019 9:33 AM GMT
భీమవరంలో పవన్ ఓటమి ఖాయం..
X
భీమవరం.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. ఇక్కడ జనసేనాని పవన్ కల్యాణ్ పోటీచేస్తుండడంతో అందరి చూపు దీనిపైనే నెలకొంది. ఇక్కడ బలమైన స్థానిక నేత గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్ సీపీ తరుఫున పవన్ పై ఢీ అంటే ఢీ అంటున్నారు. తనపై పవన్ చేసిన వ్యాఖ్యలు తాజాగా గ్రంథి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.

శనివారం గ్రంథి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సంజీవనా అన్న చంద్రబాబుతో చేతులు కలిపిన పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు లేఖ రాసిన తడిగుడ్డతో గొంతు కోసే బాబుతో పవన్ తెరవెనుక పొత్తు పెట్టుకున్నారని గ్రంథి విమర్శించారు.

ఈ ఎన్నికలకు ముందే జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేయడం మంచిదని వైసీపీ అభ్యర్థి గ్రంథి వ్యాఖ్యానించారు. లేకపోతే భీమవరంలో పవన్ చిత్తుగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. పవన్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని.. గతంలో కేసీఆర్ తో అరగంట చర్చలు జరిపి పొగిడాడని.. ఇప్పుడు ఆయన్నే తిట్టడం ఏంటని ప్రశ్నించారు. భీమవరం మురికి కూపం అంటున్న పవన్.. ఆయన స్నేహితుడు గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు రామాంజనేయులు పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేసి ఏం ఒరగబెట్టారో చెప్పాలని ప్రశ్నించారు.

జనసేన చాలా చోట్ల అభ్యర్థులను దింపకుండా సీపీఎం, సీపీఐ, బీఎస్పీలకు ఎందుకు టికెట్ ఇచ్చిందని.. టీడీపీ సీట్లలో బలం లేని అభ్యర్థులను పవన్ దింపాడని గ్రంథి విమర్శలు గుప్పించారు. జనసేనను టీడీపీలో కలిపేస్తే ప్రజలకు క్లారిటీ వస్తుందిగా అని ఎద్దేవా చేశారు. పవన్ నీతి, నిజాయితీ నీటి మీద రాతలేనని ప్రజలకు అర్థమైందన్నారు. ప్రజల ముందు పవన్ చులకన కావద్దని.. కనీసం గౌరవం కూడా పొగొట్టుకోవద్దని హితవు పలికారు.

పవన్ బాడీ లాంగ్వేజ్, మైండ్ సెట్ చూస్తుంటే.. కేఏపాల్, మీరు సోదరుల్లాగా ఉన్నారని పవన్ పై గ్రంథి విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో పవన్ ఓడిపోవడం ఖాయమన్నారు. గౌరవంగా ఇప్పుడే నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే పరువు దక్కుతుందని అన్నారు.

జనసేన-టీడీపీ అనైతిక పొత్తు బయటపడిందని నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు అన్నారు. చంద్రబాబును పవన్ ఎందుకు ఒక్క మాట అనడం లేదని.. ఆయన డైరెక్షన్ లోనే వైసీపీ, కేసీఆర్ పై పవన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.