Begin typing your search above and press return to search.

అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్.. అభిమాన్యునా మజాకా?

By:  Tupaki Desk   |   1 July 2021 7:23 AM GMT
అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్.. అభిమాన్యునా మజాకా?
X
భారత్ లో చెస్ కు విశేష ఆదరణ ఉంది. ఎంతో మంది గ్రాండ్ మాస్టర్ లను అందించిన చరిత్ర భారతదేశం సొంతం. ఇప్పుడు అమెరికాలోనూ భారత సంతతి వాళ్లు విశేష ప్రతిభ చూపుతున్నారు. భారతీయుల మేథస్సును ఇనుమడింపచేస్తున్నారు.

నిండా 12 ఏళ్లు కూడా లేవు. చిన్న బుడ్డోడు. అయినా అద్భుతమే సాధించాడు. ప్రపంచాన్నే నివ్వెరపరిచాడు. ప్రపంచ చెస్ చరిత్రలో ఓ రికార్డును నమోదు చేశాడు. అతడు ఎవరో కాదు.. భారత సంతతి కుర్రాడే. అమెరికాలో ఉంటూ ఈ ఘనత సాధించాడు.

ప్రపంచ చెస్ చరిత్రలో గ్రాండ్ మాస్టర్ (జీఎం) హోదా పొందిన పిన్న వయస్కుడిగా భారత సంతతికి చెందిన అమెరికా చిన్నారి అభిమన్యు మిశ్రా రికార్డు నెలకొల్పాడు. వెజెర్ కెప్కో జీఎం టోర్నీలో భాగంగా తొమ్మిదో రౌండ్ లో అభిమన్యు మిశ్ర ఏకంగా 55 ఎత్తుల్లో భారత గ్రాండ్ మాస్టర్ లియోన్ ల్యూక్ మెండోంకాపై గెలుపొంది గ్రాండ్ మాస్టర్ హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్ ను సాధించడం విశేషం.

అభిమన్యూ జీఎం హోదా 12 ఏళ్ల 4 నెలల 25 రోజుల వయసులో అందుకొని రష్యాకు చెందిన సెర్గీ కర్ణాకిన్ (12 ఏళ్ల 7 నెలలు) పేరిట 2002 నుంచి ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టారు.

ఇదివరకే స్పెల్లింగ్ బి పోటీల్లోనూ అమెరికాలోని భారతీయ చిన్నారుల హవా కొనసాగింది. ఇప్పుడు చెస్ లోనూ వారి ప్రతిభ వెల్లివిరుస్తోంది.