Begin typing your search above and press return to search.

రైతులకి శుభవార్త ...మిడతలు రూట్ మార్చుకున్నాయట !

By:  Tupaki Desk   |   30 May 2020 3:30 PM GMT
రైతులకి శుభవార్త ...మిడతలు రూట్ మార్చుకున్నాయట !
X
ఇప్పుడే వైరస్ తో విలవిల్లాడుతున్న దేశానికి గోరుచుట్టు మీద రోకటిపోటులా మిడతల బెడద వచ్చి పడింది. ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన వలస తెగులుగా వీటి గురించి చెబుతారు. ఈ మిడత దండు తాజాగా భారత్ ‌పై దండెత్తింది. పచ్చని పంటలు కనిపిస్తే చాలు క్షణాల వ్యవధిలో నాశనం చేస్తున్నాయి. వీటి ధాటికి రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ మిడతల దండు తెలంగాణలోకి కూడా ప్రవేశించబోతుంది అని గత మూడు రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీనితో తెలంగాణ రైతాంగం ఆందోళనలో ఉన్నారు.

ఇటువంటి సమయంలో తెలంగాణ వ్యవసాయ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలంగాణ రైతులకి తీపికబురు చెప్పారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో తిష్టవేసిన మిడతల దండు మధ్యప్రదేశ్ వైపు వెళ్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గురువారం రాష్ట్రానికి 400కిలోమీటర్ల దూరంలోని విదర్భ ప్రాంతలో తిష్టవేసిన మిడతల దండు గాలివాటం ఆధారంగా నిన్న మధ్యాహ్నం దిశను మార్చుకుని మధ్యప్రదేశ్ వైపు మరిలిపోతున్నట్లు అంచనా వేశారు. దీనితో అధికారులు , రైతులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, గాలిదిశ మార్చుకుని మళ్లీ ఇటు వైపు వస్తాయా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని, తెలంగాణకు వచ్చే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు అన్నారు. అయితే ఒకవేళ అవి దిశ మార్చుకుని ఇటు వైపు వచ్చినా వాటిని సంహరించేందుకు సరిహద్దుల్లో రసాయనాలు, అగ్నిమాపక యంత్రాలను ఇప్పటికే సిద్దం చేసి ఉంచామని అధికారులు వెల్లడించారు. ఇకపోతే , ఇప్పటికే ఈ మిడతల దండును సంహరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.