Begin typing your search above and press return to search.

గౌతం రెడ్డి కోసం గొప్ప నిర్ణయం

By:  Tupaki Desk   |   25 Feb 2022 11:37 AM GMT
గౌతం రెడ్డి కోసం గొప్ప నిర్ణయం
X
కొద్ది రోజుల క్రితం గుండె పోటుతో ఆకస్మికంగా కన్ను మూసిన యువ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కోసం ఏపీ సర్కార్ చిరకాలం నిలిచిపోయే పని ఒకటి చేయబోతోంది. మంత్రిగా రెండున్నరేళ్ల కాలంలో ఆయన తన శక్తిని మొత్తం పెట్టి పనిచేశారు. ఏపీ అభివృద్ధి కోసం అహరహం శ్రమించారు. ఒక విధంగా చెప్పాలీ అంటే చివరి శ్వాస వరకూ కూడా గౌతం రెడ్డి ఏపీ మేలు కోసమే తాపత్రయపడ్డారు. మరి ఆయన జ్ఞాపకాలను శాశ్వతం చేయాలని వైసీపీ ప్రభుత్వం సంకల్పించింది.

అదే టైమ్ లో మేకపాటి గౌతం రెడ్డి కుటుంబం కూడా గౌతం రెడ్డి కోసం అతి పెద్ద దానాన్నే చేస్తోంది. మేకపాటి గౌతం రెడ్డి అంత్య క్రియలు జరిగిన ఉదయగిరిలోని మెరిట్స్ కళాశాల భూములను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగిస్తోంది. అంతే కాదు, ఇక్కడ ఉన్న కాలేజిని అభివృద్ధి చేసి వ్యవసాయ విశ్వవిద్యాలయంగా చేయాలని మేకపాటి కుటుంబీకులు జగన్ని కోరారు.

ఆయన అంత్యక్రియలకు హాజ‌రైన ముఖ్యమంత్రి జగన్ వద్దకు మాజీ ఎంపీ, గౌతం రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ ప్రతిపాదన తీసుకురావడంతోనే జగన్ అంగీకరించారని చెబుతున్నారు. దాదాపుగా 225 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూములను ఉదారంగానే ప్రభుత్వానికి మేకపాటి కుటుంబం అప్పగిస్తోంది.

ఇక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేసి దానికి తమ కుమారుడి పేరు పెట్టాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరారు. దానికి జగన్ వెంటనే ఓకే చెప్పారని అంటున్నారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద జగన్ సభలో కీలకమైన ప్రకటన చేస్తారని అంటున్నారు.

నిజానికి మెరిట్స్ కళాశాల భవనాలతో పాటు వంద ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు, పైగా కొడుకు పోయిన బాధలో ఉన్న ఆ కుటుంబం ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకోవడం అంటే అందరూ కొనియాడుతున్నారు. ఉన్నత విద్యలను అభ్యసించిన గౌతం రెడ్డి వ్యక్తిగా, మంత్రిగా కూడా చాలా మందికి స్పూర్తిదాయకం.

అందువల్ల ఆయన పేరు మీద వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం కూడా చిరకాలం ఆయన కీర్తిని చాటేలా మంచి విషయం అంటున్నారు. ఇక ఉదయ‌గిరి అభివృద్ధికి కూడా మంత్రిగా గౌతం రెడ్డి ఎంతో కృషి చేశారని అంటున్నారు. ఆయన మరణాంతరం విశ్వవిద్యాలయం ఏర్పాటు అయితే ఈ జిల్లాలో వ్యవసాయానికి రైతాంగానికి కూడా మేలు జరుగుతుందని భావిస్తున్నారు.