Begin typing your search above and press return to search.

అమ్మ‌..క‌రుణ‌..వాజ్ పేయ్..ఏమిటీ మ‌ర‌ణాలు..?

By:  Tupaki Desk   |   17 Aug 2018 4:38 AM GMT
అమ్మ‌..క‌రుణ‌..వాజ్ పేయ్..ఏమిటీ మ‌ర‌ణాలు..?
X
వారి మాటే వేద‌మైంది. వారేం చెబితే అది జ‌రిగిపోయే ప‌రిస్థితి. మొత్తంగా.. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. రాజ‌కీయాల్ని శాసించారు. అంతేనా.. త‌మ‌దైన రాజ‌కీయాల‌తో కోట్లాది మంది మ‌న‌సుల్ని గెలుచుకోవ‌టం క‌నిపిస్తుంది. వారే.. జ‌య‌ల‌లిత‌.. క‌రుణానిధి.. వాజ్ పేయ్. వాస్త‌వానికి ఈ ముగ్గురికి ఒక‌రి త‌ర‌హాతో మ‌రొక‌రికి ఏ మాత్రం పొస‌గ‌దు. ఇంకా చెప్పాలంటే జ‌య‌ల‌లిత‌.. క‌రుణ‌ల‌తో వాజ్ పేయ్ ను అస్స‌లు పోల్చ‌టం. ఎందుకంటే.. ఆయ‌న స్కూల్ చాలా చాలా డిఫ‌రెంట్‌.

విలువ‌ల కోసం ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని సైతం లైట్ తీసుకున్న మ‌హా సాహ‌సికుడు.. ఆద‌ర్శ‌ప్రాయుడు. రాజ‌కీయాల్లో వారు వ్య‌వ‌హ‌రించే తీరునుప‌క్క‌న పెడితే.. కోట్లాది మంది మ‌న‌సుల్ని దోచిన ఈ ముగ్గురు ముఖ్య‌నేత‌లు.. ఇటీవ‌ల కాలంలో అనంత‌లోకాల‌కు వెళ్లిపోవ‌టం తెలిసిందే. రాజ‌కీయాల్లో వేర్వేరు దారుల్లో ఈ ముగ్గురు అధినేత‌లు న‌డిచినా.. వారి స్వ‌భావాలు వేర్వురుగా ఉన్నా.. ఈ ముగ్గురి మ‌ర‌ణం మాత్రం ఇంచుమించు ఒకేలా ఉండ‌టం క‌నిపిస్తుంది.

త‌మ మాటే వేదంగా.. త‌మ క‌నుసైగే శాస‌నంగా రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేసిన ఈ ముగ్గురి చివ‌రి రోజుల్లో.. స్పృహ‌లో లేకుండా.. తామేం చేస్తున్నామో అర్థం కాని ప‌రిస్థితుల్లో అనారోగ్యంతో కాలం చేయ‌టం ఒక కామ‌న్ పాయింట్ గా చెప్ప‌క త‌ప్ప‌దు.

అనారోగ్యంతో ఆసుప‌త్రికి చేరిన అమ్మ జ‌య‌ల‌లిత‌.. అదే ఆసుప‌త్రిలో చివ‌రిశ్వాస తీసుకున్నారు. ఆసుప‌త్రిలో గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు ప్ర‌క‌టించినా.. ఆమె మ‌ర‌ణం మీద ప‌లు సందేహాలు వ్య‌క్తం కావ‌టం.. చివ‌ర‌కు ఒక క‌మిటీ ఏర్పాటు చేసి విచారిస్తున్న వైనం తెలిసిందే. త‌న చివ‌రి క్ష‌ణాల్లో ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యం తెలియ‌ని ప‌రిస్థితి. ఆమె మ‌ర‌ణాన్ని సైతం త‌క్ష‌ణ‌మే ప్ర‌క‌టించ‌కుండా లేట్ చేశార‌న్న అభిప్రాయం ఉంది. అదే త‌ర‌హాలో క‌లైంజ‌ర్ క‌రుణ మ‌ర‌ణాన్ని చెప్పాలి.

చివ‌రి రోజుల్లో ఆయ‌న ఆసుప‌త్రిలో స్పృహ‌లో లేని ప‌రిస్థితుల్లో ఉండ‌టం తెలిసిందే. ముదిమి వ‌య‌సులో.. తీవ్ర అనారోగ్యంతో ఆయ‌న తీవ్రంగా ఇబ్బందిప‌డ్డారు. చివ‌రి క్ష‌ణాల్లో స్పృహ‌లో లేకుండానే కోట్లాది మందిని ఒంట‌రిని చేసి వెళ్లిపోయారు. తాజాగా వాజ్ పేయ్ విష‌యంలోనూ అలాంటిదే జ‌రిగింది. సుదీర్ఘ‌కాలం అల్జీమ‌ర్స్ వ్యాధితో బాధ ప‌డిన ఆయ‌న‌.. తానేమిట‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోయి చాలాకాల‌మే అయ్యింద‌ని చెబుతారు.

అప్ప‌ట్లో భార‌త‌ర‌త్న‌ను అందుకున్న వేళ‌లోనూ.. త‌న‌కొచ్చిన అత్యున్న‌త పుర‌స్కారాన్ని ఆయ‌న గుర్తించ‌లేద‌న్న మాట వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు దేశ రాజ‌కీయాల్ని తీవ్రంగా ప్ర‌భావితం చేసిన పెద్ద‌మ‌నిషి.. త‌న మ‌హాభినిష్క్ర‌మ‌ణ వేళ‌లో.. ఏ మాత్రం స్పృహ‌లో లేక‌పోవ‌ట‌మే కాదు.. తాను ఎవ‌ర‌న్న విష‌యాన్ని ఆయ‌న క‌నీసం గుర్తించ‌లేని ప‌రిస్థితుల్లో ఆఖ‌రి శ్వాస‌ను విడ‌వ‌టం.. ఆయ‌న మ‌ర‌ణించిన వెంట‌నే కాకుండా.. కాస్త ఆల‌స్యంగా ప్ర‌క‌టించార‌న్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. జ‌నాల హృద‌యాల్ని గెలుచుకున్న రాజ‌కీయ ప్ర‌ముఖులు.. త‌మ చివ‌రి రోజుల్లోఅయిన వారు చుట్టూ ఉన్నా.. త‌మ‌దైన లోకంలో ఉండి వెళ్లిపోవ‌టం క‌నిపిస్తుంది.