Begin typing your search above and press return to search.

వరల్డ్ రికార్డ్ సృష్టించిన గ్రీన్ ఇండియా చాలెంజ్..

By:  Tupaki Desk   |   5 July 2021 6:32 AM GMT
వరల్డ్ రికార్డ్ సృష్టించిన గ్రీన్ ఇండియా చాలెంజ్..
X
ఈ వానాకాలంలో తెలంగాణ ‘పచ్చ’లహారం అవుతోంది. కనుమరుగైన అడవులను, చెట్లను మళ్లీ సృష్టించే అవకాశం కలుగుతోంది. తెలంగాణ హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ రికార్డులు నెలకొల్పుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సృష్టించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రపంచ రికార్డ్ సృష్టించింది. గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. ఆదిలాబాద్ కేంద్రంగా ఈ సరికొత్త అడుగు వేసింది.

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న 58వ పుట్టిన రోజు సందర్భంగా ‘వన్ అవర్-వన్ మిలియన్’ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకత్త, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని తన వంతుగా వేప మొక్కను మొదటి మొక్కగా నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరై మొక్కలు నాటారు. ఆదిలాబాద్ రూరల్ దుర్గానగర్ ప్రాంతంలో కనుమరుగైన అటవీ ప్రాంతంలో ఈ లక్షల మొక్కలు నాటి మళ్లీ అడవిని సృష్టించారు. దాదాపు 200 ఎకరాల్లో యాదాద్రి మోడల్ లో ఒక గంట వ్యవధిలోనే ఐదు లక్షల మొక్కలు నాటారు.

దీంతోపాటు ఆదిలాబాద్ రూరల్ బేల మండలంలో రెండు లక్షల మొక్కలు, అర్బన్ లో 45వేల మొక్కలు, ఇళ్లల్లో లక్ష 80వేల మొక్కలు, జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బీ రోడ్డుకు ఇరువైపులా లక్ష మొక్కలు గంట వ్యవధిలోనే నాటారు.

ఈ భారీ ప్లాంటేషన్ కోసం మొత్తం 10 సెక్టార్లుగా విభజించి మొత్తం 30వేల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు, ఆదిలాబాద్ వాసులు మొక్కలను నాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇక ఎమ్మెల్యే జోగు రామన్న తన పుట్టినరోజు సందర్భంగా రెండు అంబులెన్స్ లను ఎంపీ సంతోష్ చేతుల మీదుగా రిమ్స్ ఆస్పత్రికి అందించారు.

ఇప్పటిదాకా టర్కీలో ఒక గంటలో 3 లక్షల 3వేల మొక్కలు నాటి గిన్నిస్ బుక్ లో ఎక్కారు. ఇప్పుడు దాన్ని అధిగమించి ఒక గంటలోనే 10 లక్షలు మొక్కలు నాటి గిన్నిస్ రికార్డ్ ను బద్దలు కొట్టారు. ఈ మేరకు తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ మహా ప్లాంటేషన్ చోటు దక్కించుకుంది. ఎమ్మెల్యే జోగు రామన్న, ఎంపీ సంతోష్ ల పేరుమీద ప్రశంస పత్రం గిన్నిస్ బుక్ రికార్డ్ గా అందింది.