Begin typing your search above and press return to search.

తిరుమలలో గ్రీన్ మ్యాట్.. తితిదే కు థాంక్స్

By:  Tupaki Desk   |   5 Jun 2022 8:03 AM GMT
తిరుమలలో గ్రీన్ మ్యాట్.. తితిదే కు థాంక్స్
X
వేసవి సెలవులు ముగుస్తున్నాయి. సమ్మర్ క్యాంపులకు వెళ్ళిన పిల్లలంతా ఇళ్ల బాట పడుతున్నారు. కొద్ది రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానుండటంతో ఈ ఏడాది తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి బయలుదేరారు. వేసవి ముగుస్తున్నందున భక్తులతో తిరుమల కొండ సందడిగా కనిపిస్తోంది. చాలా మంది కాలినడకన స్వామి వారిని దర్శించుకుంటున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తితిదే అధికారులు గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేశారు.

జూన్ నెల మొదలైంది. కొద్దిరోజుల్లో స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి బయలుదేరుతున్నారు. భక్తుల రద్దీతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. శనివారం ఒక్కరోజే 90 వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో శ్రీవారి దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో.. స్వామి వారికి హుండీ ఆదాయం భారీగా వస్తోంది.

తిరుమల శ్రీవారిని కాలినడకన దర్శించుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. కానీ వేసవిలో కాలినడకన వెళ్లడం చాలా కష్టం. ఎంత కష్టమైనా స్వామి దర్శనానికి చాలా మంది కాలినడకనే బయలుదేరుతారు. వారు వేసవిలో ఇబ్బందులు పడకుండా తితిదే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎండ వేడికి భక్తుల కాళ్లు కందిపోకుండా.. వారి కోసం గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేసింది.

అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గమనించారు. ఆయన తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న సమయంలో నడక దారిలో.. మోకాలి మిట్ట నుంచి అక్కగార్ల గుడి వరకు ఎండ వేడిలో భక్తులు కాళ్లు కాలుతూ పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయారు. భక్తులతో మాట్లాడి వారి ఇబ్బందిని తెలుసుకున్న సుబ్బారెడ్డి.. నడక మార్గం లోని మోకాలి మిట్ట నుంచి అక్కగార్ల గుడి మలుపు వరకు వెంటనే గ్రీన్ మ్యాట్ వేయించాలని అధికారులను ఆదేశించారు.

24 గంటల్లో పని పూర్తి చేసి తనకు సమాచారం ఇవ్వాలని చీఫ్ ఇంజనీరింగ్ నాగేశ్వరరావును సుబ్బారెడ్డి ఆదేశించారు. ఆగమేఘాల మీద స్పందించిన తితిదే.. గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేసి దాని మీద నీళ్లు చల్లించే ఏర్పాటు చేసింది. భక్తులు సౌకర్యంగా స్వామి దర్శనానికి వెళ్లేలా సౌకర్యం కల్పించారు. తితిదే ఏర్పాట్ల పట్ల నడక మార్గంలో తిరుమల చేరుకుంటున్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తితిదే చైర్మన్ సుబ్బారెడ్డిని అభినందిస్తున్నారు.