Begin typing your search above and press return to search.

ఏపీలో మద్యం ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్..అయినా సగం ఉత్పత్తే

By:  Tupaki Desk   |   2 May 2020 4:30 PM GMT
ఏపీలో మద్యం ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్..అయినా సగం ఉత్పత్తే
X
ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి కట్టడికి నెల రోజులకు పైగా అమల్లో ఉన్న లాక్ డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగించబడింది. అయితే మూడో దశ లాక్ డౌన్ లో చాలా వాటికి మినహాయింపులు దక్కిన నేపథ్యంలో ఏపీలో మద్యం ఉత్పత్తికి జగన్ మోహన్ రెడ్డి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మూడో దశ లాక్ డౌన్ లోని మినహాయింపుల్లో భాగంగా మద్యం విక్రయాలకు కూడా మినహాయింపు ఇస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో మద్యం ఉత్పత్తికి జగన్ సర్కారు శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బీవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు.

ఏపీలో మద్యం ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్ దక్కినా... రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి సగం మేర మాత్రమే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 24 మద్యం ఉత్పత్తి సంస్థలున్నాయి. వాటిలో మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పోరేషన్లు (అర్బన్) పరిధిలో 10 సంస్థలుండగా.. మిగిలిన 14 సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. కరోనా విస్తృతి నేపథ్యంలో అర్బన్ పరిధిలోని మద్యం ఉత్పత్తి సంస్థలకు మద్యం తయారీకి అనుమతి దక్కలేదు. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సంస్థలకు మాత్రమే మద్యం తయారీకి అనుమతి ఇచ్చారు. దీంతో మద్యం ఉత్పత్తికి జగన్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా... గ్రామీణ ప్రాంతాల్లోని 14 డిస్టిలరీస్, బ్రూవరీస్ సంస్థల్లో మాత్రమే మద్యం తయారీ మొదలు కానుంది.

ఇదిలా ఉంటే... శనివారమే ప్రభుత్వం నుంచి మద్యం తయారీకి అనుమతలు వచ్చేసినా... డిస్టిలరీలు, బ్రూవరీలు తెరచుకునేందుకు వారం రోజులు పట్టే అవకాశాలున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీల్లో తయారవుతున్న మద్యం బ్రాండ్లకు మార్చితోనే అనుమతులు ముగిసిపోయాయి. ఇప్పుడు సదరు బ్రాండ్లను తయారు చేయాలంటే గడువు ముగిసిపోయిన అనుమతులను రెన్యూవల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. ఆ తర్వాత సదరు ఉత్తర్వులకు అనుగుణంగా ఆయా మద్యం తయారీ సంస్థలు ఉన్న జిల్లా కలెక్టర్లు సదరు మద్యం బ్రాండ్ల తయారీకి అనుమతులు ఇవ్వాలి. ఈ మొత్తం ప్రక్రియ ఎంత వేగంగా జరిగినా... వారం రోజుల సమయం పట్టవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.