Begin typing your search above and press return to search.

‘గ్రీన్ కార్డు’కు గ్రీన్ సిగ్నల్?

By:  Tupaki Desk   |   20 Feb 2021 7:30 AM GMT
‘గ్రీన్ కార్డు’కు గ్రీన్ సిగ్నల్?
X
అమెరికాలో శాశ్వత నివాసం ఉండడానికి విదేశీయులకు అనుమతినిస్తూ ఇచ్చే ‘గ్రీన్ కార్డ్’ కోసం భారతీయులు సహా ఎన్నో దేశాల వారు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. వేలాది మంది భారతీయ ఐటీ ఇంజనీర్లు, వారి కుటుంబ సభ్యులు, విదేశీయులకు లబ్ధి చేకూర్చే నిర్ణయాన్ని తాజాగా జోబైడెన్ సర్కార్ తీసుకుంది.

గ్రీన్ కార్డుపై దేశాల కోటా పరిమితిని ఎత్తివేయడంతో పాటు దేశంలో చట్టవిరుద్ధంగా తలదాచుకుంటున్న 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి వీలు కల్పించే అమెరికా పౌరసత్వ బిల్లు-2021ను గురువారం కాంగ్రెస్ లో జోబైడెన్ సర్కార్ ప్రవేశపెట్టింది.

ఈ బిల్లును ఉభయసభలు ఆమోదించి అధ్యక్షుడు జోబైడెన్ సంతకం చేస్తే అమెరికాలో ఉంటున్న వేలాది మంది ఐటీ నిపుణులకు.. వారి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారితోపాటు చట్టబద్ధంగా ఉంటున్న వారికి కూడా లబ్ది చేకూరేలా ఈ బిల్లును రూపొందించారు.

వలస విధానంలో సమూల సంస్కరణల ద్వారా వలసదారుల్లో భయం లేకుండా వారికి ఆర్థిక భద్రత కల్పించేలా అమెరికా పౌరసత్వ బిల్లు-2021ని తీసుకువచ్చినట్లుగా వారు మీడియాకు తెలిపారు.

వలస విధానంలో సంస్కరణలతో అమెరికాలో ఉండాలనుకునే వారి కలలు ఫలించి మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. అమెరికా ప్రజల ప్రాధాన్యం కోసమే ఈ బిల్ అన్నారు. కష్టపడే వారి కలలు తీరుద్దాం అని బైడెన్ అన్నారు.