Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ నియమాలకు తూట్లు .. ఆలయాల్లో ప్రసాదం పంపిణీకి గ్రీన్ సిగ్నల్ !

By:  Tupaki Desk   |   10 Jun 2020 10:10 AM GMT
లాక్ డౌన్ నియమాలకు తూట్లు .. ఆలయాల్లో ప్రసాదం పంపిణీకి గ్రీన్ సిగ్నల్ !
X
దేశంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ లాక్ డౌన్ వల్ల అనేక మంది ఎన్నో ఇబ్బందులకు గురైయ్యారు. అయితే ,లాక్ డౌన్ తోనే దేశంలో కొంతమేర పాజిటివ్ కేసులు తగ్గాయి అని చెప్పవచ్చు. ఈ తరుణంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ ను దృష్టి లో పెట్టుకొని లాక్ డౌన్ నుండి కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఆలయాలు, మసీదులు, చర్చిల్లో పూజలు, ప్రార్థనలు చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం అనేక నియమాలతో సోమవారం నుంచి అనుమతి ఇచ్చింది. అయితే ఏ ఆలయం లో, మసీదు లో, చర్చి లో తీర్థాలు, ప్రసాదం పంపిణి చెయ్యకూడదని కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అమలులో ఉన్నా ఓ రాష్ట్ర ప్రభుత్వం ధార్మిక కేంద్రాల్లో ప్రసాదం పంపిణి చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రసాదం పంపిణి చేస్తే కరోనా వస్తుందా ? అంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని పరోక్షంగా ప్రశ్నిస్తోంది. నరేంద్ర మోదీ ఆదేశాలను ఓ ప్రభుత్వం పెడచెవిన పెటుడుతోందని, ఇలా కరోనా వైరస్ వ్యాపించడానికి వీరు ఎందుకు సిద్దం అవుతున్నారో అర్థం కావడం లేదని కొందరు సీనియర్ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.

వైరస్ మహమ్మారిని అరికట్టడానికి ప్రతిఒక్కరు సహకరించాలని, ఆలయాలు, మసీదులు, చర్చిలకు వెళ్లే భక్తులు భౌతిక దూరం పాటించాలని, గుడిలోని విగ్రహాలు, ఫోటోలు, పుస్తకాలు, గోడలు ముట్టుకోకూడదని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అంతే కాకుండా ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో తీర్థం, ప్రసాదం పంపిణి చెయ్యకూడదని తెలిపింది. అయితే , ఆలయాల్లో ప్రసాదం పంపిణి చెయ్యడానికి పంజాబ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో ప్రసాదం తయారు చేసి భక్తులకు పంచిపెట్టుకోవచ్చని పంజాబ్ ప్రభుత్వం చెప్పింది. వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం సూచించిన ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వం పక్కనపెట్టింది.

ఆలయాలు, ప్రార్థనా మందిరాల ప్రాంగణంలోనే ప్రసాదం చేసి భక్తులకు పంపిణి చెయ్యాలని పంజాబ్ ప్రభుత్వం సూచించింది. ప్రార్థనా మందిరాల్లో ప్రసాదం చేసే సమయంలో కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపింది. అయితే , దేశవ్యాప్తంగా క్లిష్ట సమయం ఉన్న నేపథ్యంలో ప్రార్థనా మందిరాల్లో ప్రసాదం, తీర్థం పంపిణి చేస్తే పరిస్థితి చెయ్యిదాటి పోయే అవకాశం ఉందని, దేశం మొత్తం ఒక న్యాయం, మీకు మాత్రమే ఒక న్యాయమా అంటూ పంజాబ్ ప్రభుత్వాన్ని కొందరు బీజేపీ పెద్దలు ప్రశ్నిస్తున్నారు.