Begin typing your search above and press return to search.

అనుమతులకు దిగులొద్దు.. వొచ్చేస్తాయిలే..

By:  Tupaki Desk   |   13 Oct 2015 7:24 AM GMT
అనుమతులకు దిగులొద్దు.. వొచ్చేస్తాయిలే..
X
అమరావతిలో తెలుగు జాతి గర్వించేంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని అనుకుంటున్న రాజధాని నిర్మాణానికి అవసరమైన పర్యావరణ తదితర అనుమతులు పొందడానికి ఏపీ సీఆర్‌ డీఏ అధికారులు ఉరుకులు పరుగులు మీద ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని అనుమతులూ తీసుకున్న తర్వాతే రాజధాని నిర్మాణ పనులు మొదలెట్టాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. నిజానికి ఆ ఆదేశాలు వచ్చిన సమయానికి.. పర్యావరణ అనుమతులు ఒకటిరెండు రోజుల్లో వచ్చేయబోతున్నాయంటూ.. రాష్ట్ర అధికారులు ఒక ప్రకటన గుప్పించేసి.. ప్రజల్లో సందేహాలు రేగకుండా జాగ్రత్తపడ్డారు. అయితే అనుకున్నట్లుగా అనుమతులు మాత్రం ఇంకా రాకపోవడంతో హైరానా పడుతున్నట్లుగా తెలుస్తోంది.

రాజధాని శంకుస్తాపన సమయం దగ్గరపడటంతో సీఎం చంద్రబాబు నాయుడు శరవేగంగా స్పందించి అధికారులను పరుగులెత్తించారు. పర్యావరణ అనుమతులను వీలైనంత త్వరలో తెచ్చుకుంటామని భరోసా ఇచ్చారు. కాగా నేడు లేదా రేపటిలోగా అవసరమైన అన్ని అనుమతులూ తెచ్చుకుంటామని సీఆర్డీఏ అధికారులు ప్రకటించారు. నిజానికి వీరు తమ ప్రయత్నాల కోణంలోంచి సాధించేస్తాం అంటున్నారు గానీ.. అవతల కేంద్రం ఎలా స్పందిస్తూ ఉందన్నది తెలియదు.

అసలు విషయం ఏమిటంటే ఇంతవరకు రాజధాని నిర్మాణానికి గాను ఎలాంటి అనుమతులకూ తాను ప్రయత్నించలేదని రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ కి తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి అనుమతులు తెచ్చుకోవడం అధికారాన్ని దుర్వినియోగం చేయడం క్రిందికే వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ.. రాజధాని నిర్మాణం అనేది తెలుగుజాతి అవసరం కాబట్టి... దీన్ని ఒక ప్రత్యేక కేసుగా అయినా పరిగణించి.. అనుమతులు మొత్తం.. కొన్ని పరిశీలనల తనిఖీల షెడ్యూలును అతిక్రమించి.. అయినా వచ్చేస్తాయని అధికారులు చెబుతూ ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మోడీ రావడానికంటె ముందు అనుమతులు మాత్రం ఖచ్చితంగా వస్తాయని అంటున్నారు.