Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: కళ్యాణదుర్గం

By:  Tupaki Desk   |   22 March 2019 6:14 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: కళ్యాణదుర్గం
X
అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి రెండో కంచుకోటగా భావించే కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ – కాంగ్రెస్‌ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. కాంగ్రెస్‌ తరఫున ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి పోటీ చేస్తుండటంతో ఆయనకు అనుకూలంగా ఉండేందుకు టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరికి చెక్‌ పెట్టింది. టీడీపీ తరఫున డమ్మీ అభ్యర్థిగా ఉమామహేశ్వరనాయుడుకు టికెట్‌ ఇచ్చింది.

అయితే కాంగ్రెస్‌ – టీడీపీ లోలోపల కుమ్మక్కు అయ్యారనే విషయం పసిగట్టిన జనాలు ఈసారి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు మళ్లారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషాశ్రీచరణ్‌ గత నాలుగు నెలలుగా ప్రతి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎక్కడికి వెళ్లినా ఆమెకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ఎమ్మెల్యే చేసిందేమీ లేదని.. ఉషశ్రీ ముందు వాపోయారు.

కళ్యాణదుర్గం గురించి..

అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి ఆరంభం నుంచి అనుకూలంగా ఉన్నట్లు ప్రతిసారీ ఎన్నికల ఫలితాల్లో రుజువు అవుతోంది. కాగా జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా టీడీపీ కంచుకోటలుగా ఉన్నాయి.

అందులో కళ్యాణదుర్గం అసెంబ్లీ సీటు కూడా ఆరంభం నుంచి టీడీపీకి అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎనిమిది సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది కేవలం రెండుసార్లు (1989 - 2009) మాత్రమే. మరోసారి 1985లో సీపీఐ అభ్యర్థి గెలిచారు. మిగతా ఐదుసార్లు (1983 - 1994 - 1999 - 2004 - 2014) టీడీపీ విజయఢంకా మోగించింది. ఆరంభం నుంచి ఎస్సీ రిజర్వుడుగా ఉన్న కళ్యాణదుర్గం నియోజకవర్గం 2008 పునర్‌విభజనలో జనరల్‌ కు కేటాయించారు.

అనంతరం 2009లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన ఎన్‌.రఘువీరారెడ్డి విజయం సాధించారు. రాష్ట్రం విడిపోయాక జరిగిన 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ - టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రఘువీరారెడ్డి పెనుకొండ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఉన్నం హనుమంతరాయచౌదరి భారీ మెజారిటీతో విజయం సాధించారు.

విజయావకాశాలు

– ప్రభుత్వంపై వ్యతిరేకత - ఐదేళ్లుగా అభివృద్ధి శూన్యమని ప్రజల్లో భావన ఉంది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించి నవరత్నాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆ పార్టీ ఇన్‌ చార్జి ఉషాశ్రీచరణ్‌ విజయవంతం అయ్యారు.

– టీడీపీ టికెట్‌ ఉమామహేశ్వరనాయుడుకు ఇవ్వడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగారు.

– గత ఐదేళ్లుగా హనుమంతరాయచౌదరి ప్రజలకు చేసిందేమీ లేదు.

– టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వరనాయుడుకు సొంత పార్టీ నుంచి వ్యతిరేకత.

– అంతేకాకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీతో టీడీపీ కుమ్మక్కు అయిందనే విషయంలో సోషల్‌ మీడియా ద్వారా భారీ ప్రచారం సాగడంతో కాంగ్రెస్‌ – టీడీపీ గెలుపు కష్టమే.

– కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్‌.రఘువీరారెడ్డికి అంతంత మాత్రంగానే ఆదరణ. ఆయనకు సొంత క్యాడర్‌ ఉందని చెప్పుకున్నా.. కాంగ్రెస్‌ పార్టీకి లేదనే విషయం ప్రజలు గుర్తించారు. ఫలితంగా ఉషశ్రీచరణ్‌ తప్పక గెలిచే అవకాశం ఉంది.