Begin typing your search above and press return to search.

ఉట్నూరు ఎందుక‌లా భ‌గ్గుమంది?

By:  Tupaki Desk   |   8 May 2017 5:20 AM GMT
ఉట్నూరు ఎందుక‌లా భ‌గ్గుమంది?
X
సోష‌ల్ మీడియా విస్తృత‌మైన నేప‌థ్యంలో.. చిన్న చిన్న విష‌యాలు కూడా ఒక్కోసారి తీవ్ర ప‌రిణామాల‌కు దారి తీస్తున్నాయి. ప్ర‌తిఒక్క‌రూ సున్నితంగా మార‌టం.. ప్ర‌తి విష‌యాన్ని ప‌ట్టించుకోవ‌టం.. సీరియ‌స్ గా తీసుకోవ‌టంతో.. అల్ల‌రిచిల్ల‌రిగా.. బాధ్య‌తారాహిత్యంతో చేసే ప‌నులు వేలాది మందిని ప్ర‌భావితం చేస్తోంది. భావోద్వేగాల్నిదెబ్బ తీసేలా ఉంటున్న ఇలాంటి ప‌రిణామాలు అప్పుడ‌ప్పుడు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా అదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌ లో తాజాగా చోటు చేసుకుంది.

వెనుకా ముందు చూసుకోకుండా.. ఒక వ‌ర్గాన్ని కించ‌ప‌ర్చేలా వాట్స‌ప్ పోస్ట్ పెట్టిన ఒక‌రి కార‌ణంగా రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ త‌లెత్త‌ట‌మే కాదు.. ప‌ర‌స్ప‌ర దాడుల‌కు వ‌ర‌కూ వెళ్లేలా చేసింది. దీంతో.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌టానికి వంద‌లాది పోలీసులు రంగంలోకి దిగాల్సిన దుస్థితి. లాఠీ ఛార్జ్.. ర‌బ్బ‌రు బుల్లెట్ల‌ను ప్ర‌యోగించాల్సిన ప‌రిస్థితి. అంతేనా.. ప‌రిస్థితిని కంట్రోల్ చేయ‌టానికి నాలుగు జిల్లాల పోలీసుల్ని రంగంలోకి దించాల్సి వ‌చ్చింది. ఊహించ‌ని రీతిలో చోటు చేసుకున్న ప‌రిణామంతో ఎప్పుడేం జ‌రుగుతుందో అర్థం కాని రీతిలో ఉట్నూరు మారింది. ఇంత దారుణ‌మైన ప‌రిస్థితికి కార‌ణ‌మైన ఉదంతాన్ని చూస్తే.. ఉట్నూరు మండ‌లంలోని ఒక గ్రామానికి చెందిన యువ‌కుడు మ‌రో వ‌ర్గానికి చెందిన వారిని కించ‌ప‌రిచేలా వాట్స‌ప్‌ లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు.

ఇది కాస్తా వైర‌ల్ గా మార‌ట‌మే కాదు.. ఆ పోస్ట్ పెట్టిన యువ‌కుడ్ని అరెస్ట్ చేయాల‌ని కోరుతూ.. శ‌నివారం రాత్రి వేళ పోలీస్ స్టేష‌న్ ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. నిర‌స‌న‌లు శ్రుతిమించి.. ఆందోళ‌న‌కారులు రోడ్డు ప‌క్క‌న ఉన్న ప‌లు దుకాణాల్ని ధ్వంసం చేశారు. ఉట్నూర్ బంద్‌ కు పిలుపునిచ్చారు. ఆందోళ‌న‌కారుల‌కు పోలీసులు స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేసినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. బంద్ పిలుపుతో ఆందోళ‌న‌లు అంత‌కంత‌కూ పెరిగి ఇరువ‌ర్గాల మ‌ధ్య దాడులు.. ప్ర‌తి దాడుల‌కు దారి తీసింది. ఇరు వ‌ర్గాల రాళ్లు రువ్వుకోవ‌టం.. దుకాణాల్ని.. వాహ‌నాల్ని ధ్వంసం చేయ‌టంతో ఎప్పుడేం జ‌రుగుతుందో అర్థం కాక ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురయ్యే ప‌రిస్థితి. రాళ్ల దాడుల్లో ఆందోళ‌నాకారులే కాదు.. పోలీసు ఉన్న‌తాధికారుల (ఎస్పీ శ్రీనివాస్‌.. ఉట్నూర్ ఇన్ ఛార్జ్ డీఎస్పీ ల‌క్ష్మీనారాయ‌ణ‌)తో స‌హా ప‌లువురు పోలీసులు గాయ‌ప‌డ్డారు. ప‌రిస్థితిని అదుపులోకి తీసుకురావ‌టానికి పోలీసులు ప‌లుమార్లు లాఠీ ఛార్జ్ చేయ‌టం.. ర‌బ్బ‌రు బుల్లెట్ల‌ను ప్ర‌యోగించాల్సి వ‌చ్చింది.

శాంతిభ‌ద్ర‌త‌లు అంత‌కంత‌కూ దిగ‌జారుతున్న వేళ‌.. కరీంన‌గ‌ర్ డీఐజీ రంగంలోకి దిగారు.క‌లెక్ట‌ర్ తో స‌హా ప‌లువురు ఉన్న‌తాధికారులు హుటాహుటిన స్పందించి.. ప‌రిస్థితిని సాధార‌ణ స్థితికి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇరు వ‌ర్గాల పెద్ద‌ల్ని కూర్చోబెట్టి.. త‌ర‌త‌రాలుగా క‌లిసిమెలిసి ఉన్న వారు.. ఎవ‌రో ఒక ఆక‌తాయి పెట్టిన పోస్ట్ తో అంత‌గా రియాక్ట్ అయి.. ఘ‌ర్ష‌ణ‌కు దిగాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. వాట్స‌ప్ లో అనుచిత పోస్ట్ పెట్టిన వ్య‌క్తిని అరెస్ట్ చేయాలంటూ ఇరు వ‌ర్గాల పెద్ద‌లు పోలీసులు కోరారు. ఇదిలా ఉండ‌గా.. అనుచిత పోస్ట్ పెట్టిన వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా నాలుగు జిల్లాల నుంచి అద‌న‌పు భ‌ద్ర‌తా బ‌ల‌గాల్ని తీసుకొచ్చి ముంద‌స్తు భ‌ద్ర‌తా ఏర్పాట్లు తీసుకున్నారు. వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టించేలా సోష‌ల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారి విష‌యంలో పోలీసుల్ని మ‌రింత క‌ర‌కుగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/