Begin typing your search above and press return to search.
ఆ రెడ్లు కలిశారు!..సీఎం రమేశ్ కు దెబ్బ పడింది!
By: Tupaki Desk | 20 Feb 2018 5:51 AM GMTకడప జిల్లా రాజకీయాలంటేనే ఆసక్తి రేకెత్తించేవన్న పేరుంది. ఇక ఆ జిల్లాకు చెందిన జమ్మలమడుగు నియోజకవర్గం పేరెత్తితే... మరింత ఆసక్తి రేకెత్తడం ఖాయమే. ఎందుకంటే.. గడచిన ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆదినారాయణరెడ్డి... అక్కడి టీడీపీ ఇన్ చార్జీ - మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో విభేదాలున్నా... టీడీపీలో చేరిపోయారు. అంతేనా ఏకంగా మంత్రి పదవి కూడా కొట్టేశారు. ఆదిని పార్టీలోకి తీసుకోవద్దంటూ రోజుల తరబడి వ్యతిరేకించిన రామసుబ్బారెడ్డి... ఎట్టకేలకు ఎమ్మెల్సీ పదవి దక్కడంతో సైలెంట్ అయిపోయారు. అయినా కూడా ఏళ్ల తరబడి రాజకీయ శత్రువులుగా కొనసాగుతున్న వీరిద్దరి మధ్య.. ఒకే పార్టీలో ఉన్నా సయోధ్య కుదరనే లేదని చెప్పాలి. మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి... తన కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని, తనను అసలు పార్టీ ఇన్ చార్జీగానే గుర్తించడం లేదని ఇప్పటికే చాలా సార్లు పార్టీ అధిష్ఠానానికి రామసుబ్బారెడ్డి ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఇక అభివృద్ధి పనుల విషయంలోనూ తన వర్గానికి ఆదినారాయణ రెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నారని కూడా రామసుబ్బారెడ్డి చాలా సార్లే ఆరోపణలు గుప్పించారు.
అయితే ఇదంతా నిన్నటి వరకే. ఎందుకంటే... నిన్న జరిగిన ఓ ఆసక్తికర ఘటన మొత్తం జమ్మలమడుగు సీన్ నే మార్చివేసిందని చెప్పాలి. మొన్నటిదాకా బద్ధ శత్రువులుగా మెలగిన ఆదినారాయణరెడ్డి - రామసుబ్బారెడ్డి వర్గాలు ఒక్కుమ్మడిగా ఒకే చోట చేరి తమ ఇద్దరికీ అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత - రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కు చెందిన కంపెనీ కార్యాలయంపై ఏకంగా దాడికి దిగేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనమే అయ్యిందని చెప్పాలి. ఎందుకంటే... రామసుబ్బారెడ్డి - ఆదినారాయణ రెడ్డిలు కలిశారంటేనే నమ్మశక్యం కాకుంటే... దానిని మరిపించేలా వారిద్దరి వర్గాలు కూడబలుక్కుని చేతిలో చేయి వేసుకుని ఏకంగా తమ సొంత పార్టీ సీనియర్ నేత కార్యాలయంపైకి దండెత్తడం సంచలనం కాక మరేమవుతుంది. ఇక ఈ ఘటన వివరాల్లోకెళితే... గండికోట రిజర్వాయర్ పునరావాస కాలనీల్లో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇందులో కొర్రపాడు గ్రామ పునరావాసానికి సంబంధించి రూ. 8.14 కోట్లు - నేదరపేట గ్రామానికి సంబంధించి రూ. 5.20 కోట్లు - ముచ్చుమర్రి పునరావాసానికి సంబంధించి రూ. 5.44 కోట్లు - సుగుమంచిపల్లె గ్రామానికి సంబంధించి రూ. 5.65 కోట్లు విలువైన టెండర్లున్నాయి.
ఈ టెండర్లకు సంబంధించి ఆన్ లైన్ లో బిడ్లను దాఖలు చేసేందుకు సోమవారమే ఆఖరు తేది. ఆదినారాయణ రెడ్డి - రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన స్థానిక టీడీపీ నాయకులు ఈ టెండర్లు తమకే ఇప్పించాలంటూ తమ నేతలపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఈ పునరావాస పనులను సీఎం రమేష్ కు చెందిన రుత్విక్ కన్ స్ట్రక్షన్స్ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు చెందిన నాయకులు స్థానిక ఆర్ అండ్ బి బంగ్లాలో సమావేశమై... ఈసారి ఈ పనులు రుత్విక్ కన్ స్ట్రక్షన్స్ కు ఇవ్వరాదని నిర్ణయించారు. అదే సమయంలో మధ్యాహ్నం సమయంలో టెండర్లు నిలిపివేస్తున్నట్లు నీటిపారుదల కార్యాలయం నుంచి వీరికి సమాచారం అందింది. దీంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాము కూడా టెండర్లు వేస్తున్నామనే అక్కసుతో రుత్విక్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీయే టెండర్లు ఆపివేయించిందని భావించి ఆ కంపెనీపై దాడికి దిగారు. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాలకు చెందిన 50 మంది నాయకులు స్థానిక రుత్విక్ కన్ స్ట్రక్షన్స్ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడున్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమకు టెండర్లు దక్కకుండా చేయించేందుకే రుత్విక్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ టెండర్లను నిలిపివేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పనీ కంపెనీయే చేజిక్కించుకుంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పనిలో పనిగా అక్కడే రుత్విక్ కన్ స్ట్రక్షన్ కంపెనీ చేపడుతున్న రోడ్డు పనులను కూడా వీరు నిలిపివేయించారు. మొత్తంగా మొన్నటిదాకా బద్ధ శత్రువులుగా మెలగిన ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీలు ఒక్కటి కలిసిపోయి... ఎంపీ సీఎం రమేశ్ కంపెనీపై దాడి చేశారన్న మాట. మరి ఇక వీరిద్దరూ కలవరులే అనుకున్న పార్టీ అధిష్ఠానం... ఆదినారాయణరెడ్డి - రామసుబ్బారెడ్డిలు కలిసినందుకు సంతోషపడాలో... వారిద్దరు కలిసి పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డ పార్టీ సీనియర్ నేత - ఎంపీగా ఉన్న కీలక నేత కార్యాలయంపై దాడికి దిగినందుకు బాధపడాలో తెలియని స్థితిలో పడిపోయిందని మాత్రం చెప్పక తప్పదు.