Begin typing your search above and press return to search.

బాప్‌..ఇది ఐటీ ఉద్యోగుల రాజ‌కీయ‌ పార్టీ

By:  Tupaki Desk   |   19 April 2018 11:27 AM GMT
బాప్‌..ఇది ఐటీ ఉద్యోగుల రాజ‌కీయ‌ పార్టీ
X
దేశంలోని మ‌తాలు - కులాలు - వ‌ర్గాల‌కు చిరునామాగా ప‌లు పార్టీలు ఇప్ప‌టికే ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇదే స‌మ‌య‌లో ఇంజినీర్లు - డాక్ట‌ర్లు - లాయ‌ర్లు - మాజీ ఐఏఎస్‌ లు రాజ‌కీయ పార్టీని స్థాపించారు. త‌మ ఉనికిని నిలుపుకొన్నారు. అయితే మ‌రో కొత్త పార్టీ తెర‌మీద‌కు రానుంది. కంప్యూట‌ర్ ఇంజ‌నీర్ లు కలిసి మ‌రో కొత్త‌ రాజ‌కీయ‌పార్టీని తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అర‌వింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ఢిల్లీ రాజ‌కీయాల్లో ఘ‌న‌విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. అలాగే 2020 నాటికి బీహార్ లో పాగా వేయ‌డానికి ఐటీ ఉద్యోగ‌స్తులు బ‌హుజ‌న ఆజాద్ పార్టీ.. బాప్ ను స్థాపించి..జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

దేశ రాజకీయాల్లోకి ఐఐటీ నిపుణులు రాబోతున్నారు. రాజకీయాల్లో మార్పును కోరుతూ.. అణగారిన వర్గాల హక్కుల్ని కాపాడడం కోసం.. ఈ కొత్త పార్టీ రాబోతున్న‌ట్టు వారు ప్ర‌క‌టించారు. కొంత మంది ఐఐటీ నిపుణులు జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. ఢిల్లీ - ఖరగపూర్‌ కు చెందిన 50 మంది ఐఐటీ నిపుణులు ఈ కొత్త పార్టీని స్థాపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీ ఐఐటీలో పట్టా పొందిన నవీన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఈ పార్టీ నడవబోతోందని స‌మాచారం. అతిపెద్ద‌ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న దాదాపు 50 మంది నిపుణులు ఉద్యోగాలకు రాజీనామాలు చేసి కొత్త పార్టీ విధానాలపై భారీగా కసరత్తు చేస్తున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం కేంద్రం ఎన్నికల సంఘాన్ని కూడా వీరు సంప్రదించారట‌. 2020లో జ‌రిగే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా పోటీ చేసి.. ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయాల‌ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మ‌హిళ‌లు - బ‌డుగు - బ‌ల‌హీన వ‌ర్గాల భ‌విష్య‌త్ కోస‌మే ఈ పార్టీ ప‌నిచేస్తుంద‌ని.. బీహార్ లో మార్పు తీసుకొస్తుంద‌ని పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు న‌వీన్ కుమార్ తెలిపారు.