Begin typing your search above and press return to search.

ఆళ్లగడ్డలో గ్రూపు రాజకీయాలు

By:  Tupaki Desk   |   28 July 2019 1:30 AM GMT
ఆళ్లగడ్డలో గ్రూపు రాజకీయాలు
X
దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన ఏపీలో బలపడేందుకు కంకణం కట్టుకున్న బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మెల్లమెల్లగా ఏపీలోని అన్ని జిల్లాల్లో బలపడేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలకు గాలం వేస్తోంది. సామాజిక వర్గాల సమీకరణాలే ప్రధానంగా రాజకీయాలు నడిచే ఆంధ్రప్రదేశ్‌ లో అదే వ్యూహాన్ని అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. కాపులు ఎక్కువగా ఉండే కోస్తా జిల్లాల్లో అదే సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలను కమలం గూటికి చేర్చుకోవడానికి ప్రయత్నించింది.

అందులో కొంతమేర సఫలీకృతమైందని చెప్పవచ్చు. అలాగే రాజకీయాలకు కంచుకోటగా ఉన్న రాయలసీమపై దృష్టి సారించినా బీజేపీ ముందుగా కర్నూలు జిల్లాలో వ్యూహాన్ని అమలు చేసింది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రధాన వర్గమైన భూమా నాగిరెడ్డి వారసులు అఖిల ప్రియ - బ్రహ్మనాందరెడ్డిని బీజేపీలో చేర్చుకోవడానికి ఎత్తులు వేసింది. ఇందులో భాగంగా కొన్నిరోజుల క్రితం మాజీ మంత్రి అఖిలప్రియకు ఆహ్వానం పలకగా అఖిల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వ్యూహం మార్చింది.

ఈ క్రమంలో భూమా నాగిరెడ్డి సోదరుడు తనయులు భూమా కిశోర్‌ రెడ్డి - మహేశ్‌ రెడ్డిలను తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించి ఒక మెట్టు విజయం సాధించింది. కేంద్రమంత్రి జేపీ నడ్డా సమక్షంలో భూమా కిశోర్‌ రెడ్డి - మహేశ్‌ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. టీడీపీలో తమకు ఎలాంటి సభ్యత్వం లేదని వారు తెలిపారు.

కాగా భూమా అఖిలప్రియ - బ్రహ్మానందరెడ్డి కూడా బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇది నిజం కాకపోతే మాత్రం ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త గ్రూపులు మొదలైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో భూమా అఖిలప్రియ గంగుల కుటుంబంతో పాటు తమ కుటుంబానికి చెందిన వారితో కూడా పోటీ పడాల్సిన పరిస్థితులు ఉంటాయనే అంశాలు చర్చనీయంగా మారింది.