Begin typing your search above and press return to search.

జంట నగరాలపై కమలంలో కుదుపు

By:  Tupaki Desk   |   24 Aug 2018 1:30 AM GMT
జంట నగరాలపై కమలంలో కుదుపు
X
జంట నగరాలు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి పట్టున్న నగరాలు. అంతే కాదు... కమలనాధులకు జంటనగరాలే ప్రాణం. ఇక్కడ పార్టీ విస్తరించినట్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా విస్తరించలేదు. దీనికి కారణం మజ్లీస్ పార్టీయే. పాతబస్తీలో ఆ పార్టీకి దశాబ్దాలుగా ఎంతో పట్టుంది. దాన్ని అధిగమించేందుకు అక్కడి హిందువులు - ఇతర ప్రాంతాలలోని హిందువులు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచారు. దీని వెనుక ఓల్డ్‌ సిటీ టైగర్ గా ప్రసిద్ధి పొందిన ఆలె నరేంద్ర - బద్దం బాల్ రెడ్డిల కృషి ఎంతో ఉంది. ఈ విషయాన్ని పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తారు. ఒక దశలో జంట నగరాల రాజకీయాలను శాసించే స్థితికి భారతీయ జనతా పార్టీ చేరింది. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. దీనికి కారణం ఆ పార్టీ అగ్ర నాయకులే. జాతీయ స్ధాయిలోవారి ప్రాభవం కోసం సిటీలో పార్టీని ముక్కలుగా చేశారు. దీంతో జంటనగరాలలో కమల నాధులు గ్రూపులుగా విడిపోయారు. ముగ్గురు నాయకులుంటే నాలుగు గ్రూపులు అన్న పరిస్థితి ఎదురైంది.

గ‌తంలో జంట నగరాలను శాసించిన పార్టీ ఇప్పుడు క్యాడర్ లేక - నాయకులకు దిశానిర్దేశం లేక ఉన్న పట్టును కోల్పోతోంది. దీనికి తోడు స్థానికంగా కూడా గ్రూపు తగాదాలు నానాటికీ పెరుగుతున్నాయి. పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగానూ - ఎమ్మెల్యేగానూ చేసిన ఓ నాయకుడు జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానంలో బిజేపీ నాయకుని అండతో పార్టీలో గ్రూపులను ప్రోత్సహించారు. నిజానికే ఆయనే పెద్ద గ్రూపుగా వ్యవహరిస్తున్నారు. దీంతో కమలం ఇప్పుడు వాడిపోయే పరిస్థితి వచ్చింది. పాతబస్తీలో అగ్ర నాయకుడైన బద్దం బాల్‌ రెడ్డిని స్థానిక నాయకులు దూరం పెట్టారు. దీంతో ఆయన వర్గం పార్టీకి దూరమైంది. ఇది భారతీయ జనతా పార్టీకి చేటు చేసింది. ఇటీవల యువనాయకుడు - ఎమ్మెల్యే రాజా సింగ్ ను కూడా టార్గెట్ చేశారు. దీనికి కారణం ఆయన భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వానికి దగ్గరవుతున్నారని అంటున్నారు. రాజా సింగ్ ఇప్పుడు పార్టీకి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వేరు కుంపటి పెట్టుకున్నారు.

తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉన్నా..... ఆయనకు కిషన్ రెడ్డి వర్గీయులు సహకరించడం లేదంటున్నారు. ఇక మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ వర్గానిది ఓ విషాదం. కేంద్రంలో ఉన్న ఒక్క తెలంగాణ మంత్రి దత్తాత్రేయను అధిష్టానం ఆ పదవి నుంచి తొలగించింది. దీంతో ఆయన వర్గీయులు పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు చేతికి అందివచ్చిన కుమారుడు కూడా అకాల మరణం చెందడంతో దత్తాత్రేయ పార్టీ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్నట్లు జంటనగరాలలో భారతీయ జనతా పార్టీ ప్రాబ‌ల్యం కోల్పోవడానికి లక్ష కారణాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గతం కంటే చాలా తక్కువ స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి.