Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు బలమే బలహీనత అవుతోంది
By: Tupaki Desk | 7 Jun 2018 4:04 AM GMTసుదీర్ఘకాలమైన ఆకాంక్షను నెరవర్చినప్పటికీ...అనంతరం వచ్చిన 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ అవకాశం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అన్ని అస్త్రాలను కాంగ్రెస్ నేతలు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై పోరాటం అనే సహజమైన ఎజెండాతో పాటుగా ఇతర పార్టీల నుంచి చేరికలను అనే రాజకీయ వ్యూహాన్ని సైతం అమల్లో పెడుతోంది. అయితే, ఇదే ఆ పార్టీకి బెడిసికొడుతోందని అంటున్నారు. ఇతర పార్టీల నుంచి నేతలుచేరడం బలం అవుతుందని భావిస్తే...అది కాస్త బలహీనతకు వేదికగా మారిందని విశ్లేషిస్తున్నారు. పలు జిల్లాలో ఈ సమస్యలు తెరమీదకు రావడం ఆసక్తికరంగా మారింది.
ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం కలకలానికి దారితీసింది. నాగంతో దశాబ్దాల వైరం ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత - ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్ ఎస్ లోకి వెళ్లే అంశంపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో జిల్లాపరిషత్ చైర్మన్ గా ఉన్న కూచికూళ్ల.. ప్రస్తుతం నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఇంచార్జిగా కూడా ఉన్నారు. తనకు చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన నాగంకు కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఇవ్వాడాన్ని తమ నేత జీర్ణించుకోలేక పోతున్నారని దామోదర్ రెడ్డి అనుచర వర్గం అంటోంది. నాగర్ కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నాగంకు హామీ ఇచ్చినట్టు వార్తలు రావడం, ఇదే విషయాన్ని నాగం కూడా ప్రచారం చేసుకోవడంతో దామోదర్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. తనతో పాటు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై కూడా కూచికూళ్ల ఆందోళన పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ లోనే ఉంటూ నాగర్ కర్నూలు రాజకీయాల్లో తలపండిన నేతగా పేరున్న దామోదర్ రెడ్డికి సౌమ్యుడిగా పేరుంది. అలాంటి నేతను తమ గూటికి లాగేందుకు టీఆర్ ఎస్ సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడిపోయింది.
మరోవైపు బీజేపీకే చెందిన ఆదిశ్రీనివాస్ హస్తం కండువా కప్పుకోవడం కీలక నియోజకవర్గమైన వేములవాడలో విబేధాలు పొడచూపేందుకు కారణంగా మారింది. ఆది చేరికతో వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు గ్రూపులుగా చీలిపోయారు. ఆదిశ్రీను చేరికను వ్యతిరేకిస్తూ వస్తున్న ఏఐసీసీ సభ్యుడు కొనగాల మహేష్ - టీపీసీసీ సభ్యుడు ఏనుగు మనోహర్ రెడ్డి ప్రత్యేకంగా గ్రూపుకట్టారు. ఆది శ్రీను చేరిక కార్యక్రమాన్ని బహిష్కరించారు. తమ అనుయాయులతో కోరుట్లలో క్యాంపు రాజకీయం మొదలెట్టారు. వేములవాడ కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు సాగరం వెంకటస్వామి అధ్యక్షతన బుధవారం జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ - కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం ఆధ్వర్యంలో సుమారు 1500మంది అనుచరులతో బుధవారం `మళ్లీ` కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తమకు సమాచారం ఇవ్వకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కొనగాల మహేష్ - మనోహర్ రెడ్డిలతో పాటు నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు - కార్యకర్తలు కార్యక్రమాన్ని బహిష్కరించారు. పొన్నం తీరును నిరసిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. వేములవాడలో ర్యాలీ చేపట్టారు. అనంతరం కోరుట్లలో మహేష్ - మనోహర్ రెడ్డి గ్రూపువాళ్లు క్యాంపు ఏర్పాటు చేశారు. స్థానిక నాయకులను కాదని ఆదిశ్రీనును పొన్నం ప్రోత్సహించటంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని వారు తీర్మానించారు.