Begin typing your search above and press return to search.

చీరాల పంచాయితీ: చినిగా చాటయ్యేలా ఉందే?

By:  Tupaki Desk   |   13 March 2021 1:30 PM GMT
చీరాల పంచాయితీ: చినిగా చాటయ్యేలా ఉందే?
X
ప్రకాశం జిల్లా వైసీపీలో వర్గపోరు పతాక స్థాయికి చేరిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.. చీరాల నియోజకవర్గం ఇందుకు వేదికగా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు కొన్నిరోజులుగా పొడచూపుతున్నాయని అక్కడి పరిస్థితులను బట్టి తెలుస్తోంది.

ఇప్పటికే చీరాలలో అధికార వైసీపీ నేతల మధ్య సయోధ్యకు సీఎం జగన్, మంత్రులు రంగంలోకి దిగి సర్ధి చెప్పినా వివాదం సమసిపోవం లేదు.తాజాగా కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేశ్ మీద.. బలరాం పీఏ త్రివేణి మీద మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో చీరాల వైసీపీలో ఉన్న అంతర్గత కలహాలు బయటపడ్డాయి.

ఈనెల 6న అర్ధరాత్రి సమయంలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రధాన అనుచరుడు రాంబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. డ్యూటీ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వెళుతున్న సమయంలో రాంబాబుపై దాడి చేయగా.. రాంబాబు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడాయన పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో గుంటూరుకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాంబాబుపై దాడి చేసిన వారిలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

అయితే తాజాగా తన పీఏ రాంబాబుపై దాడి చేసిన ఘటనలో చీరాల్ రూరల్ సీఐ రోశయ్య, ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్, బలరాం పీఏ త్రివేణి పాత్ర ఉందని ఆమంచి ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనమైంది. వారిని నిందితులుగా చేర్చాలని ఆమంచి డిమాండ్ చేశారు.మున్సిపల్ ఎన్నికల వేళ తనను ఓడించాలనే పీఏపై దాడి చేశారని ఆమంచి ఆరోపించాడు.

మొదటి నుంచి చీరాల వైసీలో కరణం వర్సెస్ ఆమంచి పోరు నడుస్తోంది. ఉప్పు నిప్పులా ఉండే వీరిద్దరూ ఒకే నియోజకవర్గంలో ఉండడంతో దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. దీంతో అధికార పార్టీకి ఈ పరిణామాలు ఇబ్బందిగా మారాయి. ఎవ్వరూ చెప్పినా వినని ఈ నేతల తీరుతో వైసీపీకి తలనొప్పులు వస్తున్నాయి.