Begin typing your search above and press return to search.

నోట్ బ్యాన్‌-జీఎస్టీ-వాట్ నెక్ట్స్‌...బోకిల్ చెప్పేశారు!

By:  Tupaki Desk   |   27 Dec 2017 3:30 PM GMT
నోట్ బ్యాన్‌-జీఎస్టీ-వాట్ నెక్ట్స్‌...బోకిల్ చెప్పేశారు!
X
పెద్ద నోట్ల ర‌ద్దు - గూడ్స్ అండ్ స‌ర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)... ఈ రెండు కూడా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ముప్పు తిప్ప‌లు పెట్టాయి. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వెనుక‌డుగు వేసే స‌మ‌స్యే లేద‌ని చెప్పిన మోదీ.. ఆ రెండింటినీ అమ‌లు చేసి చూపించేశారు. నోట్ల ర‌ద్దు కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా జ‌నం నెల‌ల త‌ర‌బ‌డి నానా ఇబ్బందులు ప‌డ్డా... మోదీ మ‌న‌సు మాత్రం క‌ర‌గ‌లేద‌నే చెప్పాలి. ముందు కాస్త నొప్పి అనిపించినా... అంతిమంగా తాను తీసుకున్న ఈ క‌ఠిన నిర్ణ‌యం పేద‌ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కూడా మోదీ ప‌దే ప‌దే చెప్పారు. అయినా పెద్ద నోట్ల ర‌ద్దుపై మోదీకి స‌ల‌హా ఇచ్చిందెవ‌ర‌న్న విష‌యంపై నాడు శూల శోధ‌న చేసిన మీడియా... ఆ వ్య‌క్తిని కూడా క‌నిపెట్టేసింది. స‌ద‌రు వ్య‌క్తిని జ‌నం ముందు నిల‌బెట్టింది కూడా. అయితే ఆ వ్య‌క్తి కూడా మోదీ కంటే మొండి ఘ‌ట‌మే. ఆయ‌న‌నే ఆరెస్సెస్ నేప‌థ్య‌మున్న అనిల్ బోకిల్‌.

రీసెర్చి ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ పూనే పేరిట ఓ సంస్థ‌ను ఏర్పాటు చేసిన బోకిల్‌... వృత్తిప‌రంగా ఓ పెద్ద ఆర్థిక‌వేత్త‌గానే పేరుంది. అస‌లు దేశంలోని అవినీతిని క‌డిగిపారేస్తానంటూ రంగంలోకి దిగిన మోదీ ఎన్నిక‌ల్లో అయితే విజ‌యం సాధించారు గానీ... ఎన్నిక‌ల ప్ర‌చారంలో చెప్పిన‌ట్లుగా స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న మ‌న న‌ల్ల కుబేరుల డ‌బ్బుకు సంబంధించి సింగిల్ రూపాయిని వెన‌క్కు తీసుకురాలేక‌పోయారు. ఈ దిశ‌గా కొంత ప్ర‌య‌త్నం జ‌రిగినా... అంతిమంగా ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అన్న చందంగా త‌యారైంది ప‌రిస్థితి. అయినా నోట్ల ర‌ద్దు - జీఎస్టీ అమ‌లు దాదాపుగా అయిపోయాయి క‌దా... మ‌ళ్లీ ఇప్పుడు బోకిల్ ప్ర‌స్తావ‌న ఎందుకంటారా? ఈ రెండింటితోనే దేశంలోని అవినీతి అంతం కాద‌ట‌. ఈ రెండు క‌ఠిన నిర్ణ‌యాల‌తో పాటుగా బిజినెస్‌ లో ట్రాన్స‌ప‌రెన్సీ కావాల్సిందేన‌ట‌. ఇది దేశంలోని అన్ని ర‌కాల లావాదేవీలు బ్యాంకుల ద్వారా జ‌రిగితేనే... ఆ ట్రాన్స‌ప‌రెన్సీ వ‌స్తుంద‌ట‌.

నిజ‌మా? అంటే.. బోకిల్ చెబితే నిజ‌మ‌ని న‌మ్మాల్సిందే క‌దా. ఎందుకంటే... బోకిల్ అలా చెప్పారో, లేదో... ఇలా మోదీ పెద్ద నోట్ల ర‌ద్దుకు ప‌క్కా ప్లాన్ ర‌చించార‌న్న ప్ర‌చారం ఉంది క‌దా. మ‌రి ఇప్పుడు బోకిల్ నోట బిజినెస్ ట్రాన్స‌ప‌రెన్సీ మాట వినిపిస్తే... దానిని అమ‌లు చేసే దాకా మోదీ నిద్ర‌పోర‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా బోకిల్ ఈ బిజినెస్ ట్రాన్స‌ప‌రెన్సీ మాట ఎక్క‌డ చెప్పార‌న్న విష‌యానికి వ‌స్తే... జైపూర్‌ లో ఆల్ ఇండియా క్లెయింట్ పంచాయ‌త్ ఆధ్వ‌ర్యంలో *ప్రజెంట్ ఎక‌నామిక్స్ అండ్ క‌స్ట‌మ‌ర్‌* పేరిట జ‌రిగిన ఓ స‌ద‌స్సులో మాట్లాడిన సంద‌ర్భంగా బోకిల్ చాలా విష‌యాలే చెప్పారు. పెద్ద నోట్ల ర‌ద్దు - జీఎస్టీల‌ను సైతం ప్రస్తావించిన ఆయ‌న‌... ఈ రెండింటి ఫ‌లాల‌ను మ‌నం త్వ‌ర‌లోనే చూస్తామంటూ మోదీ మాదిరే ఓ స్టేట్ మెంట్ ప‌డేశారు.

ఆ త‌ర్వాత అస‌లు విష‌యంలోకి మ‌ళ్లిన ఆయ‌న నోట్ల ర‌ద్దు - జీఎస్టీల‌తో మాత్ర‌మే దేశంలో అవినీతికి అడ్డుక‌ట్ట ప‌డ‌ద‌ని, బిజినెస్ కార్య‌క‌లాపాల్లో పార‌ద‌ర్శ‌క‌త‌తోనే అది సాధ్య‌మ‌ని చెప్పారు. బిజినెస్ వ్య‌వ‌హారాల్లో పార‌ద‌ర్శ‌క‌త... ఒక్క బ్యాంకింగ్ స‌ర్వీసుల ద్వారా మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంద‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. అంటే ప్రస్తుతం సాగుతున్న బిజినెస్ వ్య‌వ‌హారాలు పూర్తిగా బ్యాంకింగ్ స‌ర్వీసుల ద్వారా కాకుండా ఇత‌ర‌త్రా జ‌రుగుతున్న‌ట్లుగా బోకిల్ చెప్పారు. అయితే బ్యాంకుల ప్ర‌మేయం లేకుండా జ‌రిగే కార్య‌కలాపాల‌న్నీ కూడా ఇక‌పై బ్యాంకుల ద్వారానే జ‌ర‌గాల్సి ఉంద‌ని బోకిల్ త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్ప‌క‌నే చెప్పేశారు. ఇప్ప‌టికే పెద్ద నోట్ల ర‌ద్దు - జీఎస్టీ - బ్యాంకు సేవ‌ల్లో ప‌రిమితుల ద్వారా ఎక్క‌డిక‌క్క‌డ ఇబ్బందులు వస్తున్నాయి. ఈ క్ర‌మంలో బోకిల్ చెప్పిన‌ట్లుగా అన్ని ర‌కాల ఆర్థిక కార్య‌క‌లాపాలు బ్యాంకుల ద్వారా అంటే...ఇంకెంత మేర ఇబ్బందులు వ‌స్తాయో చూడాలి.