Begin typing your search above and press return to search.

రెండు తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ దాడులు.. ఎవరి మీదనంటే?

By:  Tupaki Desk   |   24 Dec 2019 5:23 AM GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ దాడులు.. ఎవరి  మీదనంటే?
X
ఆదాయ పన్ను శాఖకు చెందిన అధికారుల దాడుల గురించి తరచూ వార్తల్ని చూస్తుంటాం. జీఎస్టీ పుణ్యమా అని ఇప్పుడు ఆ శాఖకు చెందిన అధికారులు చేస్తున్న దాడులతో రాజకీయ.. సినీ వర్గాల కు చెందిన వారే కాదు పారిశ్రామికవేత్తలు వణుకుతున్నారు. మొన్నటికి మొన్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో పాటు అనసూయ మీదా జీఎస్టీ అధికారులు దాడులు చేయటం తెలిసిందే. తమ ఇంటి మీద ఎలాంటి దాడులు చేయ లేదని అనసూయ ట్వీట్ చేసినా.. ఆ తర్వాతి రోజే ఒక ప్రముఖ మీడియా సంస్థలో అనసూయ మీద జీఎస్టీ దాడులు ఎప్పుడు చేసింది? ఆమె ఇప్పటికి చెల్లించాల్సిన మొత్తం ఎంత? అన్న వివరాలతో పెద్ద వార్తే పబ్లిష్ అయ్యింది.

తన మీద మీడియా లో వచ్చిన వార్తలతో ఫైర్ అయిన అనసూయ.. తాజా వార్త మీద మాత్రం నోరు మెదపకుండా కామ్ గా ఉండి పోయారు. ఈ దాడుల చర్చ ఇంకా ముగియకముందే.. మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ అధికారులు మరోసారి దాడులు చేశారు. 23 ప్రత్యేక టీంలతో సోదాలు చేస్తున్నారు. తాజా దాడుల్లో ఒక సినీ ప్రొడక్షన్ ఆఫీసు తో పాటు ఒక కూల్ డ్రింక్ తయారీ కంపెనీ మీదా దాడులు నిర్వహించారు.

ఇవే కాకుండా పలు ఎలక్ట్రానిక్ సంస్థల మీదా.. ప్లాస్టిక్ పైపుల తయారీ కంపెనీల మీదా దాడులు నిర్వహించి.. భారీ ఎత్తున పన్నుల్ని ఎగ్గొడుతున్నట్లుగా గుర్తించారు. సినీ ప్రొడక్షన్ కార్యాలయం మీద నిర్వహించిన దాడుల్లో పెండింగ్ లో ఉన్న రూ.60 లక్షల మొత్తాన్ని చెల్లించినట్లుగా తెలుస్తోంది. కూల్ డ్రింక్స్ తయారీ కంపెనీ అయితే ఏకంగా రూ.5కోట్లు బకాయిలు ఉన్నట్లు తేల్చారు. మొత్తంగా వరుస దాడులతో జీఎస్టీ అధికారులు పన్ను బకాయి దారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారని చెప్పక తప్పదు.