Begin typing your search above and press return to search.

మస్తు వైరల్ అవుతున్న జీఎస్టీ బిర్యానీ టేస్ట్ చూడాల్సిందే

By:  Tupaki Desk   |   20 July 2022 5:09 AM GMT
మస్తు వైరల్ అవుతున్న జీఎస్టీ బిర్యానీ టేస్ట్ చూడాల్సిందే
X
ఒక దేశం.. ఒక పన్ను పేరుతో వచ్చి పడిన జీఎస్టీ మీద ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత గుర్రు తాజాగా పన్ను పరిధిలోకి తీసుకొచ్చిన పాలు.. పెరుగు.. మజ్జిగ.. పన్నీర్ లాంటి నిత్యవసర వస్తువులు.. ఆ మాటకు వస్తే సాదాసీదా జీవి సైతం రోజువారీగా వాడే వస్తువులపై పన్నుపోటు వేస్తే ఎవరికి మాత్రం మండదు చెప్పండి. అందుకే.. ఇప్పటివరకు ఎన్ని వస్తువుల్ని ఎంతలా పన్ను వేసినా పట్టించుకోని వారు సైతం తాజా ఎపిసోడ్ లో మాత్రం రియాక్టు అవుతున్నారు.

పాలు.. పెరుగు.. మజ్జిగ.. లస్సీలను కూడా వదలకుండా వేసిన జీఎస్టీపై తాజాగా ఒక పోస్టు వైరల్ అవుతోంది. జీఎస్టీ బిర్యానీ పేరుతో వైరల్ అవుతున్న ఈ పోస్టును చదవాల్సిందే.. కాదు కాదు టేస్టు చూడాల్సిందే. ఈ జీఎస్టీ బిర్యానీ మొత్తం చదివిన/టేస్ట్ చేసిన తర్వాత మోడీ మాష్టారి జీఎస్టీ లెక్క ఇంతలా ఉందా? అన్న భావన కలుగక మానదు. ఇంతకాలం ఇంతేసి పన్నులు కట్టేస్తున్నామా? అన్న ఆలోచన వచ్చినంతనే ఒళ్లు మండిపోవటం ఖాయం.

ఎందుకంటే.. సంపాదించే సంపాదనలోనే ఆదాయపన్ను లాక్కునే కేంద్రం.. పన్ను కట్ చేసి ఇచ్చే సొమ్ములను ఖర్చు చేసే వేళలోనూ మళ్లీ.. మళ్లీ పన్నులు కట్టుడేంది? అన్నది అసలు ప్రశ్న. ఇలా కష్టపడి సంపాదించిన దానిలో ప్రతి వస్తువుకు జీఎస్టీ పన్ను రేటు డిసైడ్ చేసి వసూలు చేస్తున్న వైనం చూశాక.. ఇంతేసి సొమ్ములు కట్టేస్తున్నామా? అన్న ఫీలింగ్ కలుగక మానదు. ఇంకెందుకు ఆలస్యం.. జీఎస్టీ బిర్యానీ రుచి చూద్దామా? దీనికి ముందు మరో చట్టబద్ధమైన వివరణ ఇవ్వాల్సి ఉంది. అదేమంటే.. ఈ వంటకం మా సొంతం కాదు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న దీన్ని యథాతధంగా వాడేస్తున్నాం. ఇక.. మొదలెట్టండి.

ఈ రోజు వంట.. జీఎస్టీ బిర్యానీ.!

హాయ్.. మధ్యాహ్నం వంటల కార్యక్రమానికి స్వాగతం.. ఈ రోజు హైదరాబాదీ చికెన్ జీఎస్టీ ధమ్ బిర్యానీ ఎలా చేయాలో తెల్సుకుందాం..

ముందుగా 12 శాతం జీఎస్టీ పెట్టి కొన్న స్టీల్ పాత్రలో.. 5 శాతం జీఎస్టీ వేసిన ప్యాకేజ్డ్ చికెన్ ఒక కేజి తీసుకోవాలి. అందులో 5 శాతం జీఎస్టీ వేసిన పెరుగు, కారం, నిమ్మకాయ, జీఎస్టీ వేసిన అల్లం, జీఎస్టీ వేసిన గరం మసాలా, జీఎస్టీ కట్టి మరీ కొన్న నెయ్యి, ప్రస్తుతానికి జీఎస్టీ లేని ఉల్లిగడ్డ ముక్కల ప్రై వేసి కలుపుకోవాలి. దాన్ని 28 శాతం జీఎస్టీ పెట్టి కొన్న రిఫ్రిజిరేటర్‌లో పెట్టండి.

ఇక 12 శాతం జీఎస్టీ వేసిన అల్యూమినియం పాత్రను తీసుకొని దాన్ని 18 శాతం జీఎస్టీ చెల్లించి కొన్న స్టౌ మీద పెట్టండి. రూ. 1150 పెట్టి కొన్న గ్యాస్ సిలిండర్‌ను ఆన్ చేసి 18 శాతం జీఎస్టీ చెల్లించి కొన్న లైటర్‌తో గానీ, 12 శాతం జీఎస్టీ చెల్లించి కొన్న అగ్గిపెట్టెతో కానీ వెలిగించండి.

ఇందులో ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ ఉచితంగా అందిస్తున్న మున్సిపల్ నీళ్లు పోసి.. అందులో ప్రస్తుతానికి జీఎస్టీ లేని హోల్ స్పైసెస్ వేసి మరిగించుకోండి. ఎలాంటి ట్యాక్స్ లేని ఉప్పును కూడా వేసుకోండి. ఇక తాజాగా పెంచి 5 శాతం జీఎస్టీ గల బాస్మతీ రైస్‌ను దాంట్లో వేసుకొని.. 75 శాతం ఉడికిన తర్వాత దించండి.

ఇప్పుడు బేగంబజార్‌లో ప్రస్తుతం జీఎస్టీ లేకుండా బిల్లు లేకుండా దొరుకుతున్న బిర్యానీ పాత్రను పెట్టుకొని అడుగున 12 శాతం జీఎస్టీ ఉన్న బటర్‌ను రాసుకోండి. ఆ తర్వాత మనం ముందుగానే నానపెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి సర్దండి. ఆ పైన హాఫ్ కుక్ అయిన బాస్మతి రైసును వేసుకోండి. పాత్ర చుట్టూ 5 శాతం జీఎస్టీ ఉన్న మైదాకు ప్రస్తుతానికి ఉచితంగా వస్తున్న కాసిన్ని నీళ్లతో కలుపుకోండి. పిండిని పాత్ర అంచుకు చుట్టుకొని దానిపై మూత పెట్టుకోండి. సన్నన్ని సెగపై ఒక 40 నుంచి 50 నిమిషాలు వండుకోండి. టైం తెలుసుకోవడానికి మీరు 28 శాతం జీఎస్టీ పెట్టి కొన్న వాచ్‌ను ఉపయోగించండి.

అంతే వేడి వేడిగా హైదరాబాదీ జీఎస్టీ ధమ్ బిర్యానీ రెడీ

దీన్ని మీరు పలు రకాల జీఎస్టీలు పెట్టి కొన్న ప్లేట్లలో వేసుకొని తినండి. మిర్చి కా సాలన్ ఎలా చేయాలో వచ్చే వారం ఇదే జీఎస్టీ ఫుడ్ ప్రోగ్రామ్‌లో కలుసుకుందాం. అంత వరకు జీఎస్టీ శుభాకాంక్షలు. ఈ జీఎస్టీ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైకులు, కామెంట్ల రూపంలో స్పందించండి. ఎలాంటి జీఎస్టీ వర్తించదు సుమా..!